Telugu Gateway
Telangana

పాలించే వాడికి కూడా మెరిట్ ఉండాలి

పాలించే వాడికి కూడా మెరిట్ ఉండాలి
X

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈటెల మాటలు ఆయన వ్యాఖ్యల్లోనే...'నేను మంత్రి కావొచ్చు, కానీ ముందుగా మనిషిని. మెరిట్ లేనిదే టీచర్ కాలేరు.మెరిట్ లేనిదే మెడికల్ సీటు రాదు.పాలించే వాడికి కూడా మెరిట్ ఉండాలి.మనిషి సంఘజీవి.ఉద్యమాలు ప్రజల కోసం చేస్తే వారికి గొంతు కలపాలి. ప్రజల ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలి. దేశ పౌరునిగా,సగటు మనిషిగా స్పందించాలి. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నము. కానీ అది సక్రమంగా అమలు కాలేదు. అందుకే మనం క్రిమిలేయర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సంపద కేంద్రీకృతమే పేదరికానికి కారణం. అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికం పోదు.

ఎలుకల బాధకు ఇంటిని తగలబెట్టుకోవద్దు. ఢిల్లీ రైతు బాధ ఏదో ఒక నాడు నీ గడప కూడా తొక్కుతుంది. రాజకీయాలు మాట్లాడత లేను,రైతుల కోసం మాట్లాడుతున్న. మన ఎన్నికల విధానం వల్ల ప్రజాప్రతినిధులను ఓట్లతో గెలిపిస్తున్నాం.అయితే ప్రజలు కోరుకొని విధానాలు పాలకులు విడనాడాలి. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో,వారి ఆకాంక్షలేమిటో గుర్తెరిగి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల్లో చిచ్చు పెట్టే నిర్ణయాలు వద్దు. కొన్ని సార్లు మాలో చైతన్యం తగ్గిందని అనుకోవచ్చు.కానీ అవసరం వచ్చినప్పుడే అది మండుతుంది. ప్రజలే కేంద్రబిందువుగా,ప్రజలే ఇతివృత్తంగా ప్రభుత్వం మసలుకోవాలి.' అని వ్యాఖ్యానించారు..

Next Story
Share it