జోరు పెరిగిన తెర వెనక రాజకీయం!

తెలంగాణా ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దూకుడు పెంచారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుత వాతావరణాన్ని ఆయన తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారు అని చెపుతున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ వ్యవహారం రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపింది. ముఖ్యంగా కొండా సురేఖ కుమార్తె సుస్మిత అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు సీఎం కు సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వాళ్లందరిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో మంత్రి కొండా సురేఖ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో భేటీ అయి తన వాదన అంతా వినిపించారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కూడా ఆమె సమావేశం అయ్యారు.
తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి ల మధ్య వివాదం తలెత్తింది. ఇది కూడా పెద్ద దుమారమే రేపింది. మంత్రి ఆదేశాలను రిజ్వి ఏ మాత్రం పట్టించుకోకుండా అవసరం లేకపోయినా కూడా ఫైల్స్ ను సీఎంఓ కు పంపారు. ఇది అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ తోనే జరిగింది అనేది మంత్రి జూపల్లి అనుమానం. అయితే మంత్రి ఆదేశాలు పాటించకుండా అన్ని తమ దృష్టికి తీసుకురావాలని సీఎంఓ కోరిక మేరకే ఆయన అలా చేశారు అన్నది అధికారుల వాదన. ఈ రచ్చ తర్వాత జూపల్లి కృష్ణారావు కూడా గురువారం ఉదయం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తో భేటీ అయి తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఇది ఇలా ఉంటే మరో సీనియర్ మంత్రి నల్గొండ జిల్లా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి వచ్చిన బెదిరింపుల విషయాన్ని నేరుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో రాహుల్ కూడా ఈ మొత్తం వ్యవహారం వెనక కథ ఏంటో కనుక్కోవాల్సిందిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె సి వేణు గోపాల్ ను ఆదేశించినట్లు చెపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి..కాంగ్రెస్ అధిష్ఠానం మధ్య గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మరింత ఇరకాటంలోకి నెడుతున్నాయి అని కాంగ్రెస్ నేతలు కూడా అంచనాకు వస్తున్నారు.
ఈ పరిణామాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెర వెనక రాజకీయం జోరు పెంచారు అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో కూడా సాగుతోంది. తొలుత ఆయనపై కూడా ఆర్థిక శాఖకు చెందిన బిల్లుల విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కారణాలు ఏమైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..కీలక మంత్రుల మధ్య ఏ మాత్రం సమన్వయం లేదు అని ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణా రాజకీయాల్లో అధికార పార్టీ ..ముఖ్యంగా మంత్రుల వ్యవహారాలే కాకరేపుతున్నాయి. వీటిని ప్రతిపక్ష బిఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉంది.



