Telugu Gateway
Telangana

హుజూరాబాద్ ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు

హుజూరాబాద్ ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు
X

టీఆర్ఎస్ అధ్య‌క్ష్య ప‌ద‌వికి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఒక్క ద‌ళిత నేత‌ను కూడా భాగ‌స్వామిని చేయ‌లేద‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కెసీఆర్ తో వేదిక పంచుకోవ‌టానికి ఎంపీ రాములు, క‌డియం శ్రీహ‌రి, ప‌సునూరి ద‌యాక‌ర్ వంటి వాళ్ళు ప‌నికిరారా? అని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి కెసీఆర్ స‌డ‌న్ గా ముంద‌స్తు ఎన్నిక‌ల అంశాన్ని ఎందుకు తెర‌పైకి తెచ్చార‌ని ప్ర‌శ్నించారు. 2022 ఆగస్టులో గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలూ జరుగుతాయని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్‌ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని వ్యాఖ్యానించారు. దీన్ని ఎదుర్కొనేందుకు ఆయ‌న స‌న్నాహ‌క స‌మావేశాలు కూడా పెట్టుకుంటున్నార‌ని తెలిపారు.

మంత్రి హరీష్‌రావుకు చివరకు మిగిలేది మిత్రద్రోహి టైటిల్ మాత్రమేనని తెలిపారు. కేసీఆర్‌, హరీష్‌రావును పూర్తిగా ఇంటికి పంపే ప్లాన్ చేశారని ఆరోపించారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో బీజేపీని బలోపేతం చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అసహనంతో ఉన్నారని, ప్రతిపక్షాలను కుక్కలు, నక్కలతో పోల్చడమే ఇందుకు నిదర్శనమన్నారు. అభద్రతాభావంతో కేసీఆర్ పొంతన లేని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు. మ‌ళ్లీ టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని రెండేళ్ల ముందే ఎలా చెబుతార‌ని ప్ర‌శ్నించారు. ఎవ‌రూ అడ‌క్కుండానే ద‌ళిత ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చి మోసం చేశార‌ని, ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల హామీ కూడా ఏమైందో అంద‌రికీ తెలిసిందేన‌ని ఎద్దేవా చేశారు. ద‌ళిత బంధు ప‌థ‌కానికి కూడా ఇదే ప‌రిస్థితి రాబోతుంద‌ని తెలిపారు.

Next Story
Share it