కిషన్ రెడ్డి కుట్ర ఉత్తదేనా!

హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ కోసం తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక( డీపీఆర్) ను సమర్పించింది. మొత్తం ఏడు కారిడార్లు 122 .9 కిలోమీటర్ల కు 38595 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుంది అని అంచనా వేశారు. ఈ మేరకు అనుమతులు మంజూరు చేయాల్సిందిగా పలు మార్లు కేంద్ర మంత్రులను కలిసి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కూడా. అంతే కాదు మెట్రో తొలిదశ ప్రాజెక్ట్ ను ఎల్ అండ్ టి నుంచి టేకోవర్ చేసేందుకు వీలుగా రుణ మంజూరు ప్రతిపాదనలకు కూడా విజ్ఞప్తి చేశారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ( ఐఆర్ఎఫ్ సి) మంజూరు చేయాల్సిన 13527 కోట్ల రూపాయల రుణానికి చివరి నిమిషంలో బ్రేకులు పడ్డాయి. ఇది అంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుట్ర అంటూ ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం కేంద్రం పెట్టిన అన్ని షరతులకు ఒప్పుకుని వచ్చారు. కుట్ర కోణాన్ని పూర్తిగా మర్చిపోయారు. దీంతో అసలు తెరవెనక జరిగింది ఏంటి అన్న చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది.
మరో వైపు అంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మెట్రో తొలిదశ విలువ మదింపు...దీని స్వాధీనానికి అవసరమైన రుణం ఎంత ఉంటుంది అనే అంశంతో పాటు మెట్రో రెండవ దశ విస్తరణ ప్రాజెక్ట్ వ్యయం, అందుకు అవసరం అయ్యే రుణం ఎంత ఉంటుంది అనే అంశాలను తిరిగి అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. రెండు రోజుల పాటు ఢిల్లీ లో వరసగా కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహించిన తర్వాత వచ్చిన ఫలితం ఇది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు అంశాలకు సంబంధించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయించింది...కేంద్రానికి కూడా సమర్పించింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఎస్ బిఐ కాప్స్ తో అధ్యయనం చేయించాలి అని నిర్ణయించటం వెనక రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన లెక్కలను కేంద్రం నమ్మకనే అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.
అయితే ఇప్పడు ఎస్ బిఐ కాప్స్ రెండవ దశ అంచనాలను ఎంత కు ఫిక్స్ చేస్తుంది అన్నది కూడా ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతుంది. రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధం చేయించిన డీపీఆర్ కంటే ఇప్పుడు అంచనా వ్యయం పెరుగుతుందా...లేక తగ్గుతుందా అన్నది అందరి దృష్టిని ఆకర్షించబోతోంది. ఈ అంచనా వ్యయం భారీగా తగ్గినా ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది...ఇంతకంటే మరింత పెరిగితే అటు కాంగ్రెస్..బీజేపీలు కలిసి ఏదో చేస్తున్నాయి అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒక మంత్రి అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాలతో ఈ ప్రాజెక్ట్ అమలులో మరింత జాప్యం జరగటం ఖాయం అని తేలిపోయింది. ఇప్పుడు ఎస్ బిఐ కాప్స్ నివేదిక ఇచ్చి...దాన్ని కేంద్రం ఓకే చేసి...రుణం క్లియర్ అయితే తప్ప విస్తరణ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కదు..ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్ స్వాధీనం సాధ్యం కాదు.



