Telugu Gateway
Telangana

క్యాబినెట్ సమావేశాలు కూడా ఆలస్యంగానే!

క్యాబినెట్ సమావేశాలు కూడా ఆలస్యంగానే!
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా పదే పదే ఒక ప్రకటన చేస్తున్నారు. తాను రోజుకు 18 గంటలు పని చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తొలిసారి సీఎం అయిన సమయంలో చంద్రబాబు నాయుడు పదే పదే ఇదే మాట చెప్పేవాళ్ళు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆ 18 గంటల పని స్లోగన్ అందుకున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేదానికి వాస్తవానికి మధ్య ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. అయన హైదరాబాద్ లో ఉన్న సమయంలో కూడా రోజుకు ఒక్క శాఖకు చెందిన అంశంపై కూడా సమీక్ష చేసిన దాఖలాలు ఉండవు. ఎప్పుడైనా ఉన్నా కూడా అవి ఎప్పుడో సాయంత్రం మాత్రమే జరుగుతాయి. కొన్ని సార్లు అవి కూడా జరగవు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలు చాలా లేట్ గానే ప్రారంభం అవుతాయి అని ఆయన వర్కింగ్ స్టైల్ తెలిసిన అధికారులు చెపుతున్నారు. ఏ ఒక్క అధికారిక సమీక్ష కూడా చెప్పిన సమయానికి ప్రారంభం కాదు అని అధికార వర్గాలు వెల్లడించాయి.

మరో కీలక విషయం ఏమిటి అంటే తెలంగాణా క్యాబినెట్ సమావేశాలు కూడా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎప్పుడూ సమయానికి మొదలుకాలేదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. క్యాబినెట్ సమావేశాల విషయంలో ఇలా వ్యవహరించిన ముఖ్యమంత్రి బహుశా రేవంత్ రెడ్డి ఒక్కరే అని అయన వ్యాఖ్యానించారు. మరో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడో ఒకసారి ...క్యాబినెట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే సచివాలయాని వస్తున్నారు తప్ప...మిగిలిన సమయాల్లో అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా క్యాంపు ఆఫీస్ ముఖ్యమంత్రిగా మారిపోయారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి తన నివాసానికి దగ్గరలో ఉండే ఎంసిఆర్ హెచ్ ఆర్డీలో కొత్తగా బోధి పెవిలియన్ పేరుతో క్యాంపు ఆఫీస్ కట్టించుకున్న సంగతి తెలిసిందే. తొలుత పది కోట్ల రూపాయల లోపు అంచనా వ్యయం తో మొదలైన ఈ ప్రాజెక్ట్ తర్వాత వంద కోట్ల రూపాయలకు పెరిగింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇక్కడ కేవలం ఫెన్సింగ్ కోసం 17 కోట్ల రుపాయలు...ఫుట్ బాల్ గ్రౌండ్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. క్యాంపు ఆఫీస్ రెడీ కాకముందు కూడా రేవంత్ రెడ్డి సచివాలయానికి రాకుండా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం కోసం తాను ఏదో నిత్యం కష్టపడుతున్నట్లు చెప్పుకోవటానికి 18 గంటలు పని చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు అని కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో భయంకరమైన వాస్తు దోషాలు ఉన్నాయి అని చెప్పి మాజీ సీఎం కెసిఆర్ ఏకంగా దగ్గర దగ్గర వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో కొత్త సెక్రటేరియట్ కట్టిస్తే ...కారణాలు ఏంటో తెలియదు కానీ...సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ విధులు నిర్వహించకుండా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఆయన కొత్త క్యాంపు ఆఫీస్ కట్టించారు. అంటే ప్రజల సొమ్ముతో ఎవరు అధికారంలో ఉన్నా కూడా తమకు నచ్చినట్లు ఆఫీస్ కట్టించుకోవటం ఒక ట్రెండ్ గా మారిపోయింది అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it