Telugu Gateway
Telangana

ఇలా అయితే బిఆర్ఎస్ ఒక్క ప్రాజెక్ట్ చేయనిస్తదా?

ఇలా అయితే బిఆర్ఎస్ ఒక్క ప్రాజెక్ట్ చేయనిస్తదా?
X

గత పదేళ్లలో బిఆర్ఎస్ కు ఏ అధికారం ఉందో..అదే అధికారం ఇప్పుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. మరి బిఆర్ఎస్ తాను అనుకున్న పని ఏది అనుకుంటే అది చేసుకుంటూ పోయింది. ప్రతిపక్షాలను అడ్డగోలుగా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ గత రెండు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అటు రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ రెడ్డి నిజంగా హైదరాబాద్ బాగు కోసం...ప్రజల మేలు కోసం పని చేయాలని సంకల్పిస్తే అసలు ఆయన బిఆర్ఎస్ మద్దతు కోరాల్సిన అవసరం ఏముంది. పదే పదే కేటీఆర్, హరీష్ రావు లు వచ్చి సలహాలు ఇవ్వండి అని అడగాల్సిన అవసరం ఏముంది?. ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునిచ్చినా కూడా వాళ్ళు ఏ మాత్రం స్పందించకుండా విమర్శలు చేస్తూనే ఉన్నారు. వస్తే అభివృద్ధిలో ప్రతిపక్షాలను కలుపుకుని పోవటం తప్పేమి కాదు. ప్రతిపక్షాల కంటే ముందు ప్రాజెక్ట్ వల్ల ప్రభావితం అయ్యే ప్రజలను ఒప్పించటం కీలకం. ప్రజలను ఒప్పించుకుంటే ..అసలు ఏ పార్టీ తో కూడా సంబంధం ఉండదు.

ప్రభుత్వం అనుకున్న పని సాఫీగా చేసుకుంటూ ముందుకు పోవచ్చు. అయితే అటు హైడ్రా తో పాటు మూసి ప్రాజెక్ట్ విషయంలో కూడా ఏ మాత్రం పరిపాలనా అనుభవం లేని రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయాలవల్లే ఈ పరిస్థితి తలెత్తింది అని కొంత మంది కాంగ్రెస్ నాయకులతో పాటు అధికార వర్గాలు కూడా చెపుతున్నాయి. రేవంత్ రెడ్డి కి రాజకీయ అనుభవం ఉంది కానీ..పరిపాలనా అనుభవం లేదు అన్నది స్పష్టం. అంతే కాకుండా..ఆయన నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే పలు సమస్యలకు ప్రధాన కారణం అని..ఏదైనా పని చేయాలంటే పక్కాగా..ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుని ముందుకు పోవాలి కానీ...ఎవరో కన్సల్టెంట్స్ చెప్పిన మాటల ప్రకారం హడావుడిగా ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేయటం...తర్వాత వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకోవటానికి సమయం మొత్తం వెచ్చించటంతోనే సరిపోతుంది అనే అభిప్రాయం ఉంది. ఫార్మా సిటీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ విషయంలో ఎన్ని సార్లు పిల్లి మొగ్గలు వేశారో అందరూ చూశారు. ఇప్పుడు హైడ్రా, మూసి ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే జరుగుతుంది.

అధికారం పోయినప్పటి నుంచి బిఆర్ఎస్ తెలంగాణ తమ ప్రైవేట్ ప్రాపర్టీ అని..దీన్ని బలవంతంగా ఎవరో లాక్కున్నారు అన్న చందంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజులు కాకముందు నుంచే గోల గోల చేయటం మొదలుపెట్టింది. ఇది చూసి ప్రజలు కూడా బిఆర్ఎస్ ను చీదరించుకునే పరిస్థితి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే రేవంత్ రెడ్డి సర్కారు బిఆర్ఎస్ దూకుడు ముందు ముందు వెలవెల పోతుంది అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడే పరిస్థితి తెచ్చుకున్నారు. అటు ఆర్థికంగా పూర్తి బలంగా ఉండటంతో పాటు ఇప్పటికి బిఆర్ఎస్ కు అండగా పలు మీడియా సంస్థలు నిలుస్తున్నాయి. పలు విషయాలతో డిఫెన్స్ లో ఉండాల్సిన బిఆర్ఎస్ దూకుడు చూపిస్తుంటే...ఎదురుదాడి చేయాల్సిన రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ఈ విషయంలో వెనకపడుతోంది అనే ఫీలింగ్ కలుగుతోంది. ఇదే అభిప్రాయం కొనసాగితే రాజకీయంగా కూడా ఆ పార్టీ కి భారీ నష్టం తప్పదు అనే చర్చ ఉంది. కారణాలు ఏమైనా కానీ అటు అసెంబ్లీలోనూ ...బయట కూడా ఒక్క రేవంత్ రెడ్డి మినహా ఇతర నేతలు ఎవరూ బిఆర్ఎస్ కు గట్టి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకపోవటం మరో విచిత్రం అని చెప్పొచ్చు. పదే పదే సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ , హరీష్ రావు లు వచ్చి సలహాలు ఇవ్వమని అడుగుతున్నారు.

వాళ్ళు వద్దు అంటే ప్రాజెక్ట్ లు ఆపేస్తారా.. వాళ్ల ఎజెండా ఏంటో స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఇలా చేయటం రేవంత్ రెడ్డి బలహీనతను బయటపెడుతోంది అనే చర్చ సాగుతోంది. హైడ్రా, మూసి ప్రాజెక్ట్ లు ప్రజల మేలు కోసమే అయినప్పుడు ఫలితం చూపితే ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోతాయి. గట్టిగా విమర్శలు చేస్తున్నారు అని ఇలా బేలగా బిఆర్ఎస్ బతిమిలాడే పరిస్థితి ఉంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్రంలో పరిపాలన సాఫీగా సాగాలంటే సీఎం తో పాటు ఆయన టీం కూడా ఎంతో అనుభవం ఉన్నది అయి ఉండాలి అని..కానీ అటు సీఎం తో పాటు టీం లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది అని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story
Share it