త్వరలో తెలంగాణ అంతటా పాదయాత్ర
మోడీ..కెసీఆర్ తోడు దొంగలు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఏఐసీసీ అనుమతి తీసుకుని రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. రైతుల పక్షాన నిలబడేందుకే తాను పాదయాత్ర చేసినట్లు తెలిపారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో వారి సమస్యలు తెలుసుకునేందుకు తిరగకపోతే నన్ను మనిషి అంటారా? అని ప్రశ్నించారు. రైతులు ఎంత మంది చనిపోయినా సరే వారి శవాల మీద పునాదులు వేసుకుని అంబానీ, అదానీలకు అధికారం రాసివ్వాలని కేంద్రం చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా..ఎన్ని కుట్రలు చేసినా యాత్ర ఇక్కడ వరకూ రాకుండా ఆపలేకపోయారన్నారు. రావిరాలలో జరిగిన రాజీవ్ రైతు రణభేరి సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా రావిరాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కెసీఆర్ లు తోడు దొంగలు అని ఆరోపించారు.
'పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్లు ఆత్ విమర్శ చేసుకోవాలి. తెలంగాణ రైతాంగం పక్షాన మేం పోరాటం చేస్తాం.యాచారం, కందుకూర్, కడ్తాల్ మండలాల్లో పచ్చని పొలాలను కేసీఆర్ 15 లక్షలకు తీసుకొని కోటి రూపాయలకు ఫార్మా కంపెనీలకు అమ్ముకుంటున్నారు. కేసీఆర్ నీ ఫామ్ హౌస్‌లో ఉన్న వెయ్యి ఎకరాల భూమికి ఎకరానికి 25 లక్షల చొప్పున ఈ ప్రాంత రైతుల తరపున 48 గంటల్లో చెల్లిస్తా నీ భూములను ఇస్తవా. రైతు కోట్ల కోసం వ్యవసాయం చేయడు. గ్రామంలో అన్ని కుల వృత్తులు వ్యవసాయం మీదే ఆధారపడుతాయి. బహుళ జాతి కంపెనీలకు భూములు తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుంది. కోట్లాది ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారు. గుజరాత్ నుంచి వచ్చిన దళారులు మోడీ, అమిత్ షా, ఇద్దరు వ్యాపారులు ఆదానీ, అంబానీలకు అమ్ముతున్నారు. అదానీ, అంబాలనీలకు 80 కోట్ల రైతుల హక్కులను తాకట్టు పెడుతున్నారు. పార్లమెంట్‌లో మంద బలంతో మోడీ నల్ల చట్టాలను ఆమోదించుకున్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నల్లమల్లలో మొదటి అడుగు పడింది.' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'ఎంతో మంది త్యాగధనుల పుట్టిన గడ్డ మన తెలంగాణ. రైతుల బంద్ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొన్నది. తరువాత ఢిల్లీ వెళ్లి వచ్చాక సీఎం కేసీఆర్ కు మోడీ ఏమి చూపించాడో తెలియదు కాని కేసీఆర్ కు చలి జ్వరం వచ్చింది.. భూస్వాముల వ్యవసస్థ మళ్ళీ వస్తుంది. మార్కెట్ యార్డ్ వ్యవస్థ రద్దు అయితే పండిన పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. రైతుల పంట అంబానీ ఆధాని తక్కువ ధరలకు కొనే యత్నం. నేను రైతు బిడ్డ ను..నేను కాపొన్ని. రైతుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. ఢిల్లీ సరిహద్దులో లక్షల మంది రైతులు దీక్ష చేస్తున్నారు. 195 మంది చనిపోయారు. కేంద్రానికి చీమ కుట్టినట్లైన లేదు. పార్లమెంట్ జరుగుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని కొన్ని గాడిదలు మాట్లాడుతున్నారు. రైతుల పక్షాన నిలబడేందుకు నేను ఈ యాత్ర చేస్తున్నా. అక్కడ మోడీ ఇక్కడ కేడి కలిసి దోచుకుంటున్నారు. అక్కడ చాయ్ వాలా ఇక్కడ మందు వాలా. రైతు చట్టాలని వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.' అని ప్రకటించారు.