Telugu Gateway
Telangana

ఏ చీక‌టి స్నేహం కెసీఆర్ పై చ‌ర్య‌ల‌ను ఆపుతోంది?

ఏ చీక‌టి స్నేహం కెసీఆర్ పై చ‌ర్య‌ల‌ను ఆపుతోంది?
X

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ కు వ‌స్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి ప‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తూ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు. గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాలుగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ... తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు హామీని నెరవేర్చుతారా? లేదా? అని నిలదీశారు. విభజన హామీల్లో భాగంగా బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అని టీపీసీసీ చీఫ్ ప్ర‌శ్నించారు. నైనీ కోల్‌ మైన్స్‌ టెండర్లలో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా చర్యలెందుకు తీసుకోవడం లేదన్నారు.

గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యం ఎందుకు అని నిలదీశారు. రామాయణం సర్క్యూట్ ప్రాజెక్ట్‌లో భద్రాద్రి రాముడికి చోటెందుకు ఇవ్వలేదు అంటూ లేఖలో రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ హ‌యాంలో ప్రారంభించిన ప్రాణ‌హిత‌-చేవేళ్ల ప్రాజెక్టును కేవ‌లం క‌మిష‌న్ల కోసం కెసీఆర్ రీడిజైన్ చేశారు. దీంట్లో బారీ అవినీతి జ‌రిగింద‌ని మొద‌టి నుంచి మేం ఆరోపిస్తున్నామ‌ని, ఈ ప్రాజెక్టు కెసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింద‌ని మీ పార్టీ ప్రెసిడెంట్ న‌డ్డా కూడా తాజాగా ఆరోపించార‌న్నారు. సొంత పార్టీ నేత‌లు అయినా స‌రే అవినీతి ఆరోప‌ణ‌లు స‌హించేదిలేద‌ని బీరాల ప‌లికే మీరు ఈ ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ జ‌రిపించటానికి మీకున్న ఇబ్బంది ఏమిటి.. ఏ చీక‌టి స్నేహం మిమ్మ‌ల్ని ఆపుతోంది అని ప్ర‌శ్నించారు.

Next Story
Share it