కెటీఆర్ కు సీఎం పదవి ఎగ్గొట్టేందుకే గవర్నర్ తో గొడవ
సీఎం కెసీఆర్, గవర్నర్ తమిళ్ సైల మద్య తలెత్తిన విభేదాలపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం నాడు గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. కెటీఆర్ ను సీఎం కాకుండా అడ్డుకునేందుకే గవర్నర్ తో విభేదాలను తెరపైకి తెచ్చారన్నారు. ఇదే విషయాన్ని సీఎం కెసీఆర్ ఇంట్లో చెబుతున్నారని..గవర్నర్ తో గొడవ ఉన్నప్పుడు కెటీఆర్ ను సీఎం చేయటం కుదరదని ఆయన చెబుతున్నారన్నారు. తనను సీఎం చేయాలని కెటీఆర్ ఒత్తిడి చేస్తున్నారని..కుటుంబంలోని సమస్యల నుంచి తప్పించుకునేందుకు గవర్నర్ అంశం తెరపైకి వచ్చిందన్నారు. గవర్నర్ ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ తక్షణమే తన అధికారాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్‌కు లేని అధికారాలు..తెలంగాణ గవర్నర్‌కు ఉన్నాయని గుర్తుచేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వైద్యంచేయించుకుంటున్నారంటే.. తెలంగాణలో వైద్యం పడకేసినట్లే కదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుక్కలు, పిల్లులు, ఎలుకలు పెత్తనం చెలాయిస్తున్నాయని ఎద్దేవా చేశారు. యూనివర్సిటీల్లో ఖాళీలున్నాయని గవర్నర్ అఫీషియల్‌గా నివేదిక ఇచ్చారని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..బండి సంజయ్ ఎందుకు రాలేదు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌కు కోపం వస్తుందనే కిషన్‌రెడ్డి, సంజయ్ రాలేదన్నారు. కిషన్‌రెడ్డి సిటీలో ఉండి ఎందుకు రాజ్‌భవన్‌కి వెళ్లలేదు?అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ఈ విషయం కూడా కేంద్ర మంత్రి అమిత్ షాకు చెప్పి ఉంటే వీరి కుమ్మక్కు రాజకీయాలు బహిర్గతం అయ్యేవన్నారు.