Telugu Gateway
Telangana

కేటీఆర్ లెక్కలన్నీ తీస్తున్నారు!

కేటీఆర్ లెక్కలన్నీ తీస్తున్నారు!
X

గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ చేసినన్ని విదేశీ పర్యటనలు ఎవరూ చేయలేదనే చెప్పొచ్చు. ఇటీవల ముగిసిన ఎన్నికలకు ముందు కూడా కేటీఆర్ వరసపెట్టి అమెరికా పర్యటనలు చేశారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల జీఓలే కాదు...కనీసం మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనల జీఓలను కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం రహస్యంగానే ఉంచింది. కెసిఆర్ హయాంలో సాగింది అంతా రహస్య పాలనే. అయినా ఇప్పుడు మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ తాము కూడా శ్వేత ప్రత్రాలు ప్రకటించామని చెప్పుకుంటూ వస్తున్నారు. శ్వేత పత్రాల సంగతి ఏమో కానీ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా కూడా ఏ శాఖకు సంబదించిన వివరాలు కూడా బయటకు రాకుండా చేసింది గత కెసిఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు పలు శాఖలకు సంబదించిన అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయటానికి రెడీ అవుతున్న తరుణంలో తాము కూడా అన్నీ బహిర్గతం చేశామని...కాగ్ నివేదికల గురించి ప్రస్తావిస్తున్నారు. శ్వేత పత్రాల్లో భాగంగానే ఐటి, పరిశ్రమల శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎన్ని విదేశీ పర్యటనలు చేశారు...ఏ దేశానికి ఎన్ని సార్లు వెళ్లారు...వీటికి ఖర్చుపెట్టిన మొత్తం ఎంత?. వచ్చిన పెట్టుబడులు ఎన్ని వంటి వివరాలపై కొత్త ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. స్వయంగా సీఎంఓనే ఈ లెక్కలపై అరా తీస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.

కేటీఆర్ తో పాటు కొంత మంది ఉన్నతాధికారులు కూడా విదేశీ టూర్ల లో ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు చేసినట్లు ఆ శాఖ వర్గాలే చెపుతున్నాయి. కొంత మంది అధికారులు అయితే నిబంధనలకు విరుద్ధంగా కూడా తమకు నచ్చిన వారిని విదేశీ పర్యటనలకు తీసుకు వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఖజానా నుంచి వీటికి నిధులు డ్రా చేస్తే తర్వాత బయటపడుతుంది అని...కార్పొరేషన్లు...ఇతర సంస్థల ద్వారా విదేశీ పర్యటలను నిధులు వాడినట్లు చెపుతున్నారు. కేటీఆర్ అండ్ టీం విదేశీ పర్యటనలకు సంబదించిన వివరాలు మొత్తం రావాలంటే ఆయా శాఖలతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న అన్ని సంస్థల దగ్గర నుంచి సమాచారం సేకరించనున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ పలు మార్లు దావోస్ సమావేశాలకు కూడా హాజరు అయినా విషయం తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు కొంత మంది అధికారులు చెపుతున్నారు. రేవంత్ సర్కారు ఈ లెక్కలు అన్ని బయటకు తీస్తే ఎన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సిందే. మంత్రులు విదేశీ పర్యటనలు చేయటం తప్పేమి కాదు. కానీ ఈ సమయంలో చేసే ఖర్చు కూడా హేతుబద్దంగా ఉండాలి కానీ..అడ్డగోలుగా ఉండకూడదు అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో ఇవేమి పాటించలేదు అని..ఇష్టానుసారం వ్యవహరించారు అని ఒక ఐటి శాఖ అధికారి తెలిపారు.

Next Story
Share it