Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ ఇప్పుడు ఏమంటుందో!

బిఆర్ఎస్ ఇప్పుడు ఏమంటుందో!
X

బిఆర్ఎస్ సర్కారు గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనా కాలంలో మీడియా విషయంలో ఇష్టానుసారం వ్యవహరించింది. మాకు నచ్చితే యాడ్స్ ఇస్తాం...లేదంటే లేదు అన్న మోడల్ ఫాలో అయింది. ఏ ప్రధాన పత్రికలో అయినా కూడా ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు వస్తే వెంటనే యాడ్స్ ఆపేయమని ఆదేశాలు వెళ్ళేవి. కొన్ని నెలల పాటు అలా యాడ్స్ ఇవ్వకుండా నిలిపివేసేవాళ్ళు. వ్యతిరేక వార్తలు అంటే అదేదో కావాలని రాసినవి కూడా కాదు...ఉన్న వాస్తవాలను రాసినా కూడా కెసిఆర్ సర్కారు ఏ మాత్రం సహించేది కాదు..చేతిలో పని కాబట్టి ప్రభుత్వ యాడ్స్ పూర్తిగా ఆపేసేవాళ్ళు. తెలంగాణాలో ఇలా కెసిఆర్ సర్కారు ఆగ్రహానికి గురికాని పత్రిక ఏదైనా ఉంది అంటే అది సొంత పత్రిక నమస్తే తెలంగాణ తప్ప మరొకటి లేదు అనే చెప్పొచ్చు. ఆంధ్ర జ్యోతి పత్రికకు అయితే కొన్ని సంవత్సరాల పాటు యాడ్స్ నిలిపివేశారు. కొంత కాలం వెలుగు పత్రికకు అదే పరిస్థితి. మిగిలిన పత్రికలు ప్రభుత్వ ఆగ్రహానికి గురిఅయినప్పుడు మాత్రం కొంతకాలం యాడ్స్ పూర్తిగా నిలిపివేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ వాళ్లకు ఇచ్చేవాళ్ళు. కొద్ది నెలల క్రితం కెసిఆర్ మీడియా తో మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాముకు పలు పోసి పెంచలేము కదా..ఇదే తమ విధానం అంటూ మాట్లాడారు. అసలు వ్యతిరేక వార్తలు అనే దాన్ని ఎవరు నిర్దారించాలి...ప్రభుత్వంలో జరిగిన తప్పులు రాసినా అది వాళ్లకు వ్యతిరేక వార్త కిందే వస్తుంది. అలాంటపుడు దీనికి ప్రాతిపదిక ఏమి ఉంటుంది. మీడియా విషయంలో కెసిఆర్ అనుసరించిన వైఖరి ఉమ్మడి ప్రభుత్వం కంటే దారుణంగా ఉంది అనే చెప్పాలి.

ఉమ్మడి రాష్ట్రంలో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ లు అందరూ సచివాలయంలోకి వెళ్లి తమ దగ్గర ఉన్న సమాచారాన్ని అందుబాటులో ఉన్న మంత్రులు...ఐఏఎస్ లతో నిర్దారించుకుని వార్తలు రాసే వాళ్ళు. కానీ కెసిఆర్ పాత సెక్రటేరియట్ ను పడగొట్టిన తర్వాత అసలు ఎక్కడా మీడియా కు ఎంట్రీ నే లేకుండా చేశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఇంకా నెల రోజులు కూడా కాలేదు కానీ...కెసిఆర్ ఫ్యామిలీ పత్రిక నమస్తే తెలంగాణ మాత్రం అప్పడే సర్కారు పై ఎటాక్ ప్రారంభించింది. ఇది పూర్తిగా రాజకీయ కోణంలోనే అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తో పాటు ఇతర యాడ్స్ కూడా నమస్తే తెలంగాణ కు ఇచ్చారు. ఇప్పుడు అంటే బుధవారం నాడు తెలంగాణ పత్రికల్లో ప్రధానంగా ఒక ఫుల్ పేజీ యాడ్ వచ్చింది. ప్రజా పాలనా అభయ హస్తం గ్యారంటీలకు శ్రీకారం పేరుతో ఈ యాడ్ ఇచ్చారు. కానీ ఈ యాడ్ నమస్తే తెలంగాణకు ఇవ్వలేదు. దీంతో రేవంత్ రెడ్డి సర్కారు కూడా కెసిఆర్ గతంలో అనుసరించిన మోడల్ నే ఫాలో అవటానికి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. మరో కీలక విషయం ఏమిటి అంటే బిఆర్ఎస్ హయాంలో కెసిఆర్ ఫ్యామిలీ కి చెందిన నమస్తే తెలంగాణ పత్రికతో పాటు...టి న్యూస్ కు కూడా కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. మరి కొత్త ప్రభుత్వం వీటిపై ఏమైనా నజర్ వేస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు.

Next Story
Share it