కాంగ్రెస్ లో దుమారం!

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి..అక్రమాలపై మూడేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క యాక్షన్ లేదు. ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వసనీయత పోగొట్టుకున్నారు అనే చర్చ కాంగ్రెస్ నేతల్లోనే ఉంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ నాయకులను ...శ్రేణులను మరింత షాక్ కు గురి చేస్తున్నాయి. పాలనలో వైఫల్యాలు ఒకెత్తు అయితే..అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలం అయినట్లు కనిపిస్తోంది అనే చర్చ ఆ పార్టీ నేతల్లోనే సాగుతోంది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక రూట్ వేసిపెట్టినా కూడా రేవంత్ రెడ్డి సర్కారుకు దాన్ని వాడుకోవటం రావటం లేదు అనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. దీంతో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో రేవంత్ రెడ్డి రాజకీయంగా లబ్దిపొందటం కోసం ప్రయత్నం చేసినట్లు ఉంది తప్ప...స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉదారంగా వ్యవహరించటం ద్వారా ఆయన ఎలాంటి సంకేతాలు ఇవ్వదల్చుకున్నాడో అర్ధం కావటం లేదు అనే చర్చ కొంత మంది మంత్రుల్లో సాగుతోంది.
సభలో మాత్రం స్పీకర్ కు జరిగింది ఘోరమైన అవమానం అని చెప్పి అందరూ మాట్లాడారు కానీ..చర్యల విషయం దగ్గరకు వచ్చేటప్పటికి తాతా మధును కేవలం ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ తోనే సరిపెట్టారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు అని చెప్పి బుధవారం నాడు బిఆర్ఎస్ కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు అందరిని సస్పెండ్ చేశారు. దీంతో ఇప్పుడు ఏకంగా శాసనసభ స్పీకర్ ను అనుచితమైన భాషలో దూషించిన సభ్యుడికి...ఇతర బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీసుకున్న యాక్షన్ కు తేడా లేకుండా పోయింది. స్పీకర్ పై అనుచితంగా మాట్లాడిన తాతా మధును మండలి నుంచి బహిష్కరిస్తారు అని ఎక్కువ మంది భావించారు. గతంలో బిఆర్ఎస్ సర్కారు సభలో అనుచితంగా వ్యవహరించారు అనే కారణంతో అప్పటి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లను సభ నుంచి బహిష్కరించారు. సభలో తీర్మానం పెట్టి వాళ్ళను బహిష్కరించారు.
కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు వీడియో ల సాక్షిగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆధారాలు ఉన్నా కూడా కేవలం సస్పెన్షన్ తోనే సరిపెట్టడం కాంగ్రెస్ శ్రేణులకు కూడా నచ్చటం లేదు. గతంలో కెసిఆర్ చూపించిన దారి వాడుకోవటం కూడా రేవంత్ రెడ్డి కి రావటం లేదు అని ఒక మంత్రి అభిప్రాయపడ్డారు. కొంత మంది నాయకులూ ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీ కు పంపిస్తారు అని చెపుతున్నారు. అయినా స్పీకర్ ను దూషించిన సభ్యుడిపై చర్యకు అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ, ఎంఐఎం లు కూడా మద్దతు ఇచ్చారు. మండలి లో ఓటింగ్ పెట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఈ పని చేయకుండా రేవంత్ రెడ్డి సర్కారు తానే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్లు ఉంది అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో సాగుతోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అసెంబ్లీ లో ప్రభుత్వం తరపున మాట్లాడిన మాటలు కంటి తుడుపు వ్యవహారంగా మారిపోయాయి అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.



