Telugu Gateway
Telangana

అఖిల పక్ష స‌మావేశానికి రేవంత్ డిమాండ్

అఖిల పక్ష స‌మావేశానికి రేవంత్ డిమాండ్
X

హైదరాబాద్, తెలంగాణలో శాంతి భద్రతలు ఇంకా దిగజారకుండా, మరొకరు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోరారు. ఈ అంశంపై చ‌ర్చించేందుకు వెంట‌నే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న గురువారం నాడు సీఎం కెసీఆర్ కు బ‌హిరంగ లేఖ రాశారు. కెసీఆర్ స‌మావేశం ఏర్పాటు చేస్తే తానే స్వ‌యంగా ప్రగతి భవన్ కు వస్తానని ప్రకటించారు. హైదరాబాద్ లో పబ్, క్లబ్, డ్రగ్స్ వాడకం వంటి దుష్ట సంస్కృతి తీవ్ర భయాఆందోళనలను కలిగిస్తోంది. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు, తమ ఆడ కూతుళ్ళను బయటకు పంపాలంటే బిక్కుబిక్కుమంటూ బతకడం మనం పోరాడి సాధించుకున్న తెలంగాణకు అవమానకరం కాదా..? మన తెలంగాణ ప్రతిష్టను, హైదరాబాద్ ఖ్యాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మధ్య ఉన్న రాజకీయ పోరాటాలకు అతీతంగా ఉంది. దీనికోసం మీరు, మీ వ్యక్తిగత అహంకారాన్ని పక్కన పెట్టి అఖిలపక్షంతో, మహిళా, స్వచ్ఛంద, పౌర రక్షణ సంఘాలతో కలిసి చర్చించండి భయాందోళనకు గురి అవుతున్న ప్రజలకు విశ్వాసం కల్పిద్దాం.

శాంతిభద్రతలకు విఘాతం కల్పించే సంఘవిద్రోహ శక్తులను, తెర వెనుక వాటికి అండగా ఉన్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వారయినా కర్కశంగా తొక్కి వేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది" అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో ఇటీవ‌ల ఒక మైనరు బాలిక మీద నలుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మీరు సిగ్గుపడాల్సిన విషయం కాదా..? ఘటన జరిగిన తర్వాత నాలుగైదు రోజులపాటు పోలీసులు, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది.? సాక్ష్యాలను, ఆధారాలను మాయం చేశారని వస్తున్న వాదనకు మీరు సమాధానం చెప్పరా.? ఒక ప్రభుత్వ వాహనంలో ఈ గ్యాంగ్ రేప్ జరిగితే మీకు బాధ్యత లేదా..? మీరు నియమించిన వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు ఉన్నా, ఎందుకు తొలగించలేదు..? ఇంతకుముందే చిన్నారి చైత్రను చిదిమేయడం ఎంత అమానుషం.? వీటికి కారణం అవుతున్న డ్రగ్స్, పబ్స్, క్లబ్స్ మీద, వాటి నిర్వాహకుల మీద ఎందుకు కఠినంగా వ్యవహరిస్తలేరు...? ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు సమీక్ష చేయలేదు..? ఇది భయాందోళనల్లో ఉన్న తెలంగాణ ప్రజల మనోబలాన్ని దెబ్బ తీస్తాయి" అని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story
Share it