Telugu Gateway
Telangana

నేను మా పిల్ల‌ల‌ను తెస్తా..కెటీఆర్ ను డ్ర‌గ్స్ టెస్ట్ కు పంపిస్త‌వా?

నేను మా పిల్ల‌ల‌ను తెస్తా..కెటీఆర్ ను డ్ర‌గ్స్ టెస్ట్ కు పంపిస్త‌వా?
X

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స‌ర్కారుకు చాలెంజ్ విసిరారు. హైద‌ర‌రాబాద్ లోని ప‌బ్ లో వెలుగుచూసిన డ్ర‌గ్స్ వ్య‌వహారం రాష్ట్రంలో దుమారం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస‌గౌడ్ ఈ కేసులో ఎవ‌రు ఉన్నా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ మీడియాతో మాట్లాడుతూ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో బిజెపి, కాంగ్రెస్ నేత‌ల పిల్ల‌లే ఉన్నార‌ని ఆరోపించారు. అంతే కాదు..ఇందులో రేవంత్ రెడ్డి మేన‌ల్లుడు కూడా ఉన్నాడని విమ‌ర్శించారు. ఈ విమ‌ర్శ‌ల‌పై రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం నాడు ఘాటుగా స్పందించారు. పిల్లల్ని అడ్డం పెట్టుకొని తమపై రాజకీయం చేస్తున్నారంటూ స‌ర్కారుకు ఛాలెంజ్ విసిరారు. 'మా పిల్లలందరికీ డ్రగ్స్‌ టెస్టులకు తీసుకొస్తా.. కేసీఆర్‌.. నీ కొడుకును కూడా డ్రగ్స్‌ టెస్టుకు పంపుతావా?'.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల పబ్‌లకు అనుమతి ఇచ్చింది ఎవరని ప్ర‌శ్నించారు.

125 మందికి డ్రగ్స్‌ టెస్టు చేయకుండా ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించారు. డ్రగ్స్ అడ్డుపెట్టుకుని సినిమా రంగంపై కేటీఆర్ పట్టు సాధించారని, డ్రగ్స్ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరగాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వానికి కావాల్సిన వారిని ఈ కేసు నుంచి వ‌దిలేశార‌న్నారు. రేవంత్ రెడ్డి ధాన్యం అంశంపై కూడా స్పందించారు. తెలంగాణలో బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు... రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ చేసిన సంతకం రైతుల పాలిట మరణశాసనంగా మారిందన్నారు. బాయిల్డ్‌ రైస్‌ సరఫరా చేయబోమని... కేంద్రంతో కేసీఆర్‌ చేసుకున్న ఒప్పందం గుదిబండగా మారిందని రేవంత్ పేర్కొన్నారు. వడ్లను కనీస మద్దతు ధర రూ.1960తో కొనాలని డిమాండ్ చేశారు. కొన్న వడ్లను ఏం చేసుకుంటారో మీ ఇష్టమన్నారు. రైతులను మోసం చేయడానికి సమస్యను జఠిలం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు.

Next Story
Share it