Telugu Gateway
Telangana

అధిష్ఠానం ఓకే చేస్తుందా!

అధిష్ఠానం ఓకే చేస్తుందా!
X

ఉమ్మడి రాష్ట్రంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణాలో పురపాలక..పట్టణాభివృద్ధి శాఖ ఒక్కటిగానే ఉంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఒక విచిత్ర నిర్ణయం తీసుకుంది. పరిపాలనా సామర్థ్యం పెంచటం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు పైకి చెపుతున్నా కూడా దీని వెనక అసలు ఎజెండా వేరే ఉన్నది అన్నది రాజకీయ, అధికార వర్గాల్లో ప్రచారంలో ఉంది. మున్సిపల్ శాఖను రెండు ముక్కలుగా చేయటంతో ఇప్పుడు ఆ శాఖలో ఎక్కడలేని గందరగోళ పరిస్థితి ఉంది అని అధికార వర్గాలు చెపుతున్న మాట. ఇప్పటి వరకు ఒక్కటిగా ఉన్న ఈ శాఖ ఇప్పుడు మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ గా ఒకటి...మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ గా విభజించారు. మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ పరిధిలో హెచ్ ఎండీఏ తో పాటు జీహెచ్ఎంసి తో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లు ఉంటాయి.

ఇవే కాకుండా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ , ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ, హైడ్రా, రేరా తో పాటు దాని అప్పీలేట్ అథారిటీ కూడా ఇందులోకి వస్తాయి అని అధికార వర్గాలు తెలిపాయి. ఇక మున్సిపల్ పరిపాలన శాఖ పరిధిలోకి ఓఆర్ఆర్ వెలుపల ఉన్న మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ వ్యవహారాలతో పాటు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఇతర విభాగాలు ఉంటాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో మున్సిపల్ శాఖ ముక్కలు చేయటం వెనక చాలా పక్కా ప్లాన్ ఉంది అన్నది కాంగ్రెస్ నేతలతో పాటు అధికార వర్గాలు చెప్తున్న మాట. తెలంగాణకు అత్యధిక ఆదాయం వచ్చేది హైదరాబాద్ నగరం నుంచే అన్న సంగతి తెలిసిందే.

మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫోర్త్ సిటీ, మూసి పునర్జీవ ప్రాజెక్ట్ లు తలపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అత్యంత కీలకమైన విద్యా శాఖ తో పాటు మున్సిపల్, హోమ్ శాఖతో పాటు కార్మిక శాఖలు రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి ఆదివారం నాడు ముగ్గురు కొత్త మంత్రులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్ లో మిగిలిన ఖాళీలు భర్తీ అయినా కూడా అత్యంత కీలకమైన మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ ను తన అదగ్గరే పెట్టుకుని..మున్సిపల్ శాఖను ఇతర మంత్రులకు కేటాయించేందుకు వీలుగానే గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ శాఖను రెండు ముక్కలు చేసినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ లో ప్రతిదీ అధిష్టానం ఆమోదం తోనే జరగాల్సి ఉంటుంది. మరి ఆదాయ వనరులు ఎక్కువ మొత్తంలో తెచ్చిపెట్టే ఈ కీలక శాఖను అధిష్టానం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకోవటానికి అనుమతి ఇస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు.

Next Story
Share it