కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బుద్ధిమార్చాలని కోరుకున్నా
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల దగ్గర ఆదివారం నాడు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకునేందుకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆయన్ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా..కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అమ్మవారి ఆలయమా? లేక టీఆర్ఎస్ కార్యాలయమా అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా బారికేడ్లను తోసుకుని మరీ ఆలయంలోకి వెళ్ళారు. ప్రోటోకాల్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, అనిల్ యాదవ్, హర్కర వేణుగోపాల్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ క్రూరమైనా ఆలోచనలతో పరిపాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకుల బుద్దులు మార్చాలని అమ్మ వారిని కోరుకున్నామని తెలిపారు. ఆర్థిక సంక్షోభం రాకుండా ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా, మత సామరస్యాన్ని కాపాడాలని ..తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేలా అమ్మ వారి చల్లని దీవేనలు ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ ఉజ్జయిని అమ్మవారిని కోరుకుంటుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి హాని కలిగించే అనేక కార్యక్రమాలు పాలకులు తీసుకుంటున్నారని, అది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమన్నారు.