రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర రచ్చ రచ్చ..అరెస్ట్
ముఖ్యమంత్రి కెసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తలపెట్టగా..ఇందులో రేవంత్ తోపాటు పలువురు పార్టీ నేతలు పాల్గొనాల్సి ఉంది. అయితే రైతులను వరి వద్దన్న కెసీఆర్ తన ఫాంహౌస్ లోని 150 ఎకరాల్లో వరి వేశారని ఆదివారం నాడు మీడియాకు ఫోటోలు.వీడియోలు చూపించిన రేవంత్ మీడియాకు స్వయంగా వాటిని సోమవారం చూపిస్తానని ప్రకటించారు. దీంతో సోమవారం ఉదయం నుంచే జూబ్లిహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అక్కడకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి ఎర్రవెల్లికి బయలుదేరగా..అక్కడ మోహరించిన భారీ పోలీసు బలగాలు ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశాయి.
ఈ సమయంలో పోలీసులు, కార్యకర్తల మధ్య ఎత్తున తోపులాట జరిగింది. ఈ సందర్బంగా కెసీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాగానే అరెస్ట్ చేసిన పోలీసులు భారీ బందోబస్తుతో తరలించారు. ఉదయం నుంచే ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తూ.. ఇంటి నుంచి ఎటు వైపు నుంచి బయటికి వచ్చినా అడ్డుకుని అరెస్ట్ చేయాలని ముందస్తు వ్యూహంతో పోలీసులు ఉన్నారు. ఆయన బయటికి రాగానే అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను ఎక్కడికి తరలించారన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. అంతకు ముందు రేవంత్ మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎర్రవెల్లిలో రచ్చ బండ నిర్వహిస్తానని ప్రకటించారు.