తెలంగాణ సీఎం మాటలు నిజం అయ్యే అవకాశం ఉందా?!

వాస్తవం వేరు. చూపించే సినిమా వేరు. ఈ విషయంలో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు వరసలో ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎన్నో. అందులో ఒకటి కరీంనగర్ ను లండన్ తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. త్వరలోనే ఇది సాకారం అవుతుంది అని కూడా చెప్పుకొచ్చారు. కానీ పదేళ్ల పాలనలో మాత్రం ఆ దిశగా చేసింది ఏమీ లేదు అనే చెప్పొచ్చు. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ని ఇస్తాంబుల్ లాగా మారుస్తాం అంటూ కూడా ప్రకటించారు. ఇది ఎంత వరకు జరిగిందో అందరికి తెలుసు. అసెంబ్లీ, రాజ్ భవన్ వంటి ప్రాంతాల్లో కూడా వర్షం పడితే నీళ్లు నిలవటం ఏంటి సమైక్య పాలకులకు చేతకాలేదు...తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఈ పని కూడా చేయలేకపోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్ క్లబ్ లో చేరినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అదే లైన్స్ లో రేవంత్ కూడా పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా తుర్కపల్లి లో పర్యటించిన రేవంత్ రెడ్డి అచ్చం కెసిఆర్ లాగే తెలంగాణ రాజధాని నగరం అయిన హైదరాబాద్ ను న్యూయార్క్, టోక్యో లాగా డెవలప్ చేస్తామని ప్రకటించారు.
రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు గతంలో కూడా చెప్పారు. తమ పోటీ పొరుగు రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటకలతో కాదు ప్రపంచంతో పోటీ పడతాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఎక్కడా అప్పు పుట్టడం లేదు అని...కేంద్ర మంత్రుల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకెళ్లే వాళ్ళలా చూస్తున్నారు అంటూ చెప్పింది కూడా రేవంత్ రెడ్డే. ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్న డబ్బులతో పాటు రిటైర్ మెంట్ బెనిఫిట్స్, డీఏ లు ఇవ్వటానికి ఆగమాగం అవుతున్న రేవంత్ రెడ్డి సర్కారు మాటలు మాత్రం కోటలు దాటేలా చెపుతోంది అనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఉద్యోగులకు చట్టబద్ధంగా దక్కాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కోర్ట్ లను ఆశ్రయించాల్సిన పరిస్థితి తెలంగాణాలో ఉన్న విషయం తెలిసిందే. అంతే కాదు మొన్నటి ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన హామీల్లో ఇంకా అమలు చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రకారం అసలు ఇవి అమలుకు నోచుకుంటాయో లేదో తెలియని పరిస్థితి.
ఎన్నికలకు ముందే బిఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది అని విమర్శించి భారీ హామీలు ఇవ్వటాన్ని ఎలా సమర్ధించుకుంటారు అని ప్రశ్నిస్తే బిఆర్ఎస్ హయాంలో సాగిన అవినీతిని కంట్రోల్ చేస్తే చాలు అన్ని హామీలు అమలు చేయ వచ్చు అంటూ అప్పటిలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. కెసిఆర్ తన పదేళ్ల కాలంలో ఎలా అయితే బంగారు తెలంగాణ..ప్లాటినం తెలంగాణ అంటూ చెప్పుకుంటూ వెళ్లారో..ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫ్యూచర్ సిటీ...హైదరాబాద్ ను న్యూయార్క్, టోక్యోలాగా మారుస్తా అంటూ చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం చూస్తే రేవంత్ రెడ్డి అధికారం చేప్పట్టిన తర్వాత ప్రదిపాదించిన ఫ్యూచర్ సిటీ, మూసీ పునర్జీవం ప్రాజెక్టులు ఏ మేరకు ముందుకు సాగుతాయో చెప్పటం కష్టమే అని కొంత మంది మంత్రలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు అసలు ఏ మాత్రం నిధులు లేవు అని చెప్పే రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను న్యూయార్క్ చేస్తా, టోక్యో చేస్తా వంటి ప్రకటనలు చేస్తుండటం చూసి ఆయన కూడా కెసిఆర్ క్లబ్ లో చేరారు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.