రైతులను వద్దని..కెసీఆర్ 150 ఎకరాల్లో వరి ఎలా వేస్తారు?
రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రైతులను యాసంగిలో వరి వేయవద్దని చెప్పిన సీఎం కెసీఆర్ తన కుటుంబానికి చెందిన 150 ఎకరాల్లో వరి వేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఫోటోలను, వీడియోలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఎర్రవెల్లి-వెంకటాపురం గ్రామాల మధ్యలో కెసీఆర్, కెటీఆర్, సంతోష్ రావు ల పేరుతో ఉన్న భూముల్లో వరి వేశారన్నారు. మరి వీళ్ల వరి ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారన్నారు. సోమవారం నాడు ఎర్రవెల్లిలో రైతుల రచ్చబండ కార్యక్రమం ఉందని..ఈ సందర్బంగా మీడియా కు కూడా కెసీఆర్ వరి పంట వేసిన పొలాలను చూపిస్తానన్నారు. 150 ఎకరాలు ఉన్న కెసీఆర్ కుటుంబం మాత్రం వరి వేసుకోవచ్చు కానీ..తెలంగాణలో మూడు ఎకరాలలోపు పొలం ఉన్న వారి సంఖ్య 90 శాతం ఉంటుందని..వీరు మాత్రం వరి వేయవద్దని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరే అన్న కెసీఆర్ కు ఇప్పుడు రైతులు ఏమి చేయాలో ఆలోచించాలన్నారు. కొంత మంది వరి విషయంలో రైతులకు అవగాహన కల్పిస్తామని..వరి వేస్తే కొనుగోలు చేయమని అంటున్నారని..ఇలా ప్రచారం చేయటానికి వచ్చే ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలను చెప్పుతీసుకుకొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీస మద్దతు ధర ఉన్న పంటలను కేంద్రం కొనుగోలు చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్రం కొనుగోలు చేయాలని..కనీస మద్దదు ధరలో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. ఈ మేరకు చట్టాలోనే రైతులకు రక్షణ ఉందని పేర్కొన్నారు. చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ ఇచ్చి ఆదుకుంటుందని..పంట మార్పిడిని ప్రొత్సహిస్తూ వారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ విషయాన్ని ఆర్ధిక మంత్రి హరీష్ రావు, అన్ని శాఖల మంత్రి కెటీఆర్ లు చూసి తెలుసుకోవలన్నారు. వస్తే వారిని తానే స్వయంగా అక్కడి సీఎంతో మాట్లాడి తీసుకెళతానన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఏది చెపితే అది మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేయటం..ఆ తర్వాత వదిలేయటం అలవాటు అయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ చనిపోయిన రైతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయల పరిహారం ఇస్తానని కెసీఆర్ ఘనంగా ప్రకటించారని..కనీసం ఇప్పటివరకూ వారి జాబితా అయినా తీసుకున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో ఇన్ని రోజులు ఢిల్లీలో ఉన్నారు కదా ఈ దిశగా ఏమైనా ప్రయత్నం చేశారా అంటూ ప్రశ్నలు కురిపించారు. ధాన్యం కొనుగోలు చేయని సీఎం మనకు ఎందుకు అన్నారు. రైతులే ఆయన్ను అక్కడ కూర్చోపెట్టారని..అక్కడ కూర్చోపెట్టిన రైతులకు అక్కడ నుంచి దింపటం కూడా తెలుసున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కెసీఆర్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు.