ఎన్ని సంవత్సరాలు ఇలా !

బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ జర్నలిస్ట్ లకు రంగుల ప్రపంచం చూపించారు. హైదరాబాద్ లో...తెలంగాణాలో భూములకు కొదవలేదు..జర్నలిస్ట్ లు అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. కానీ అధికారంలో ఉన్నంత కాలం తన హామీని అమలు చేయలేదు. సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పు వచ్చిన తర్వాత అసలు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ఈ విషయం ఇంత జఠిలంగా మారటానికి కారణం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో జవహర్ లాల్ నెహ్రు హోసింగ్ సొసైటీ ప్రభుత్వానికి కోట్ల రూపాయల డబ్బులు చెల్లించింది. ప్రభుత్వం అప్పటిలో ఈ హోసింగ్ సొసైటీ కి పేట్ బషీరాబాద్, నిజాంపేట్ ప్రాంతంలో కలుపుకుని మొత్తం 70 ఎకరాలు కేటాయించింది. కానీ వ్యవహారం సుప్రీం కోర్టు కు వెళ్ళింది. మధ్యలో సుప్రీం కోర్టు ఊరట ఇచ్చినా కెసిఆర్ కానీ..కేటీఆర్ కానీ హామీ అమలుకు ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. కెసిఆర్ తో పాటు అప్పటి మంత్రి కేటీఆర్ కూడా జర్నలిస్ట్ ల విషయంలో అదే వైఖరి చూపించారు.
ప్రభుత్వాలు జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆనవాయితీ కొన్ని దశాబ్దాలుగా ఉంది. అధికారంలో ఉన్న పదేళ్లు జర్నలిస్టులకు ఇచ్చిన హామీ అమలుచేయకుండా...స్థలానికి డబ్బులు కట్టినా అది ఇవ్వని కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు లు జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల విషయంలో ఇప్పుడు సన్నాయి నోక్కులు నొక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెడుతున్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ జనలిస్ట్ ల ఇళ్ల స్థలాల హామీని అమలు చేస్తామని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు మార్లు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీం కోర్టు కల్పించిన ఊరటకు అనుగుణంగా పేట్ బషీరాబాద్ ల్యాండ్ అలాట్ మెంట్ మెమో కూడా అందించారు సొసైటీకి. కానీ సుప్రీం కోర్టు తుది తీర్పు వ్యతిరేకంగా రావటంతో దగ్గర దగ్గర 18 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టినా కూడా ఇప్పటికే సమస్య అలాగే కొనసాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్లు తనకు ఈ సమస్య పట్ల పూర్తి అవగాహన ఉంది అని...తాను హామీని అమలు చేస్తామని పదే పదే చెపుతూ వచ్చారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పాత స్థలాలు ఇవ్వలేము అని...అందరూ ఒప్పుకుంటే ఫ్యూచర్ సిటీ లో స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటన మేరకు ఎక్కువ మంది జవహర్ లాల్ సొసైటీ సభ్యులు ఫ్యూచర్ సిటీ ల్యాండ్ కు అంగీకరిస్తూ సంతకాలు చేసి మరీ ప్రభుత్వానికి తీర్మానం అందించారు. అయినా కూడా ఈ విషయంలో ఎలాంటి పురోగతి ఉండటం లేదు. దీంతో ఇప్పుడు ఇది జర్నలిస్ట్ ల్లో తీవ్ర ఆందోళనకు కారణం అవుతోంది. ఈ పరిణామాలు అన్నీ చూసి కెసిఆర్ తరహాలోనే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్ట్ లతో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఫ్యూచర్ సిటీ లో ల్యాండ్ అలాట్ మెంట్ విషయంలో మంత్రుల సబ్ కమిటీకి బాధ్యత అప్పగించినట్లు చెపుతున్నారు. మంత్రులు మాత్రం తమకు సీఎం నుంచి లేదా సీఎంఓ నుంచి అధికారికంగా ఎలాంటి నోట్ రాకుండా...ఒక ఫైల్ లేకుండా తాము ఎలా నిర్ణయం తీసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఈ విషయంలో పదే పదే ప్రకటనలు అయితే చేస్తున్నారు కానీ ఇది అమలుకు నోచుకోవటం లేదు.
నిజంగా రేవంత్ రెడ్డి కి జవహర్ లాల్ సొసైటీ తో పాటు ఇతర జర్నలిస్ట్ లు అందరికి న్యాయం చేయాలని ఉంటే స్పష్టమైన ప్రకటన చేసి అమలు చేయాలి కానీ...జర్నలిస్ట్ లనే మీరు సబ్ కమిటీ దగ్గర పని చేయించుకుని రండి..తర్వాత నేను అమలు చేస్తా అని చెప్పటంతో ఇది అంతా డబుల్ గేమ్ లాగా సాగుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సబ్ కమిటీ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పనిచేస్తుందా..లేక జర్నలిస్ట్ ల కోరిక మేరకు పని చేస్తుందా అన్న చర్చ సాగుతోంది. సబ్ కమిటీలో ఉన్న మంత్రులే సీఎం నుంచి అధికారికంగా ఆదేశాలు వస్తే తప్ప ఈ వ్యవహారం ముందుకు సాగదు అని చెపుతుంటే...సీఎం రేవంత్ రెడ్డి మాత్రం జర్నలిస్ట్ లకు మరోలాగా చెపుతూ విషయాన్ని సాగదీస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడటానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి టైం ఇవ్వటం లేదు అని...ఇప్పుడు ఆయన కూడా కెసిఆర్ బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కి స్థలాలు ఇవ్వటం ఇష్టం లేకపోతే సుప్రీం కోర్టు చెప్పినట్లు దగ్గర దగ్గర 18 సంవత్సరాల క్రితం కట్టిన డబ్బు వెనక్కి ఇస్తే సరిపోతుంది తప్ప ...ఈ దాగుడు మూతలు ఎందుకో మరి.



