ఎక్కువ లాభం ఎవరికి!

పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ప్రభుత్వం ఒక పర్పస్ కోసం కేటాయించిన భూమిని ఖచ్చితంగా అందుకే వినియోగించాలి. ఏదైనా కారణం వల్ల అలాంటి భూమిని ఇతర అవసరాల కోసం ఉపయోగించాలి అంటే సంబంధిత శాఖ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ భూమిని ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవటం సాధ్యం అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ...రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కొన్ని సంస్థలకు ఇలాంటి మినహాయింపులు ఇచ్చారు. ఆ సమయంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇలాంటి మార్పులకు అనుమతి ఇచ్చి భారీ ఎత్తున లబ్దిపొందినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెపుతున్నాయి.
పటాన్ చెరువు దగ్గర నుంచి మొదలుపెడితే నగరం నడిబొడ్డున ఉన్న అజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ విషయంలో కూడా ఇలాంటి దందాలు ఎన్నో సాగాయి. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నగరం మధ్యలోకి వచ్చినందున ఇక్కడ పరిశ్రమలు కొనసాగించటం సరి కాదు అంటూ ఇక్కడ భూములు దక్కించుకున్న వాళ్లకు పలు మినహాయింపులు ఇచ్చి అప్పటిలో అధికారంలో ఉన్న వాళ్ళు భారీ ఎత్తున ప్రయోజనం పొందారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఇలా ఒక్కో కేసు విషయంలో కాకుండా ఏకంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని పారిశ్రామిక వాడల్లో ఉన్న 9292 ఎకరాలను గుర్తించింది. ఇందులో 4740 ఎకరాలు మాత్రం వెంటనే బహుళ ప్రయోజనాలకు వాడుకునేందుకు అనువైనవిగా గుర్తించారు. అయితే ఇది అంతా కూడా ప్రభుత్వం పక్కా స్కెచ్ ప్రకారమే తెర మీదకు తెచ్చింది అనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇంత భారీ ఎత్తున అంటే వేల ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీ ని తెరమీదకు తెచ్చింది.
ఇదే ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం నుంచి పరిశ్రమల పేరుతో కారు చౌకగా భూములు దక్కించుకున్న వాళ్ళు ఇంత కాలం పరిశ్రమలు నడుపుకుని..ఇప్పుడు రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వాణిజ్య అవసరాలకు ఆ భూములు వాడుకునేందుకు అనుమతి ఇస్తామంటే ఎవరైనా ఎగిరిగంతేస్తారు. ఎలా చూసుకున్నా ఈ భూములు అనుభవిస్తున్న వారికి భారీ ఎత్తున ప్రయోజనం కలగనుంది. అయితే అధికారంలో ఉన్న వాళ్ళు అంత ఈజీగా ఈ లబ్ది వాళ్లకు చేస్తారు అంటే ఎవరూ నమ్మరు. అధికారికంగా పైకి కనిపించేది ఒకటి..తెర వెనక లావాదేవీలు ఎన్నో ఉంటాయి అని పరిశ్రమల శాఖ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఇదే అదనుగా బిఆర్ఎస్ నేతలు ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి హరీష్ రావు లు ఇది ఐదు లక్షల కోట్ల రూపాయల కుంభకోణంగా అభివర్ణిస్తున్నారు. ఇందులో ఖచ్చితంగా అక్రమాలు జరగటానికి అవకాశం ఉంది..జరగటం కూడా ఖాయం అన్నది అధికారులు చెపుతున్న మాట. కానీ అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు లు చేస్తున్న ప్రకటనలు చూసి ఇందులోని సీరియస్ నెస్ కాస్తా కామెడీ గా మారుతోంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బిఆర్ఎస్ ఆరోపణలపై పరిశ్రమల శాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు పలు మార్లు స్పందించారు. అడ్డగోలు ఆరోపణలు చేయటం మానుకోవాలని...చేతనైతే ఆధారాలు చూపించి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తోంది.
ఇదే కాంగ్రెస్ నేతలు...ముఖ్యంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ధరణి పేరుతో కెసిఆర్ ఫ్యామిలీ లక్ష కోట్ల రూపాయలు దోచుకుంది అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే బిఆర్ఎస్ ప్రైవేట్ పరం చేసిన ఓఆర్ఆర్ ను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలానే ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున అంటే ఏకంగా లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి...కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క వెయ్యి కోట్ల రూపాయల అవినీతిని కూడా నిరూపించి బిఆర్ఎస్ నేతలను దోషులుగా నిలబెట్టలేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న శ్రీధర్ బాబు ఆధారాలు చూపెట్టి ఆరోపణలు చేయాలనే కామెంట్స్ కు విలువ ఉంటుందా?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు మాట్లాడి...అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా యాక్షన్ తీసుకోని ఈ ప్రభుత్వం చెప్పే మాటలను ఎవరైనా నమ్ముతారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం పై వస్తున్న విమర్శలు చూస్తే ఈ హిల్ట్ స్కాం ..బిఆర్ఎస్ హయాంలో సాగిన ధరణి, కాళేశ్వరం స్కాం లను దాటే అవకాశం లేకపోలేదు అనే చర్చ కూడా సాగుతోంది.



