తెలంగాణలో జనవరి 2 వరకూ ఆంక్షలు

దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు ముందస్తు చర్యలు ప్రారంభించాయి. పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలు కూడా అమల్లోకి తెచ్చాయి. తెలంగాణ సర్కారు శనివారం నాడు పలు ఆంక్షలతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో విధిగా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతే కాకుండా మాస్క్ తప్పనిసరి అని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలతో జీవో జారీ చేసింది.
నూతన ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని..ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 దాకా ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. జనం గుమిగూడే ప్రాంతాల్లో థర్మల్ స్కానర్లను తప్పనిసరి చేశారు. మాస్క్ ధరించకపోతే వారికి మాత్రం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు.