మద్యం దుకాణాల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది నుంచి... మద్యం దుకాణాల్లో.. గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని నిర్ణయించారు. గురువారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కెసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాటుపై కూడా కేబినెట్ సమీక్షించింది.. దవాఖానాల నిర్మాణ ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలని, అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. కేబినెట్ సమావేశంలో తొలుత రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై చర్చించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా కేసులలో పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా అదుపులో వుందని వారు కేబినెట్ కు వివరించారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో వున్నాయని వివరించారు. ఇప్పటివరకు 2 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని, అందులో 1 కోటి 45 లక్షల 19 వేల 909 మందికి మొదటి డోసు, 55 లక్షల 36వేల 250 మందికి రెండో డోసు ఇవ్వటం జరిగిందని వైద్యశాఖ అధికారులు కేబినెట్ కు తెలిపారు. ఒకవేళ చిన్నపిల్లలకు కరోనా వస్తే పరిస్థితులను ఎదర్కోవడానికి సిధ్దంగా వున్నామని వైద్యాధికారులు కేబినెట్ కు వివరించారు. ప్రత్యేకంగా చిన్నపిల్లల వైద్యం కొరకు133 కోట్ల ఖర్చుతో 5200 బెడ్లు, మందులు తదితర సామగ్రిని, ముందస్తు ఎర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు.
కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ అండ్ బి, వైద్యారోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది. పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలకై కేబినెట్ సబ్ కమిటీ నియామకం జరిగింది. ఈ సబ్ కమిటిలో మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్ గానూ., మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్ లు సభ్యులుగానూ వ్యవహరిస్తారు. ధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యల పరిష్కార మార్గాలకోసం....మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ తీర్మానం. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడయిన రోడ్ల మరమ్మతుకు ఈ సంవత్సరం ఇప్పటికే కేటాయించిన రూ. 300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేబినెట్ కేటాయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖకు కేబినెట్ ఆదేశాలు జారీచేసింది.