తెలంగాణ సర్కారుకు ఆర్ బిఐ షాక్!
2000 కోట్ల అప్పు సమీకరణకు నో
రెండు వేల కోట్ల రూపాయల అప్పులకు బ్రేక్ పడింది. వాస్తవానికి తెలంగాణ సర్కారు మే 17న బాండ్లు వేలం వేయటం ద్వారా ఈ మొత్తం సమీకరించాలని రెడీ అయింది. ఈ మేరకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) తెలంగాణ సర్కారు అప్పుల ప్రతిపాదనకు అనుమతి మంజూరు చేయలేదు. దీంతో ప్రభుత్వం వేలంలో పాల్గొనే ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ వర్గాలు షాక్ కు గురయ్యాయి. ఆర్ బిఐ తాజాగా అప్పునకు అనుమతి మంజూరు చేయకపోవటంతో సర్కారు ఖజానాలో అనుకున్న విధంగా నిధులు జమ అయ్యే పరిస్థితి లేదు. మే 17న జరిగే వేలంలో పాల్గొనేందుకు కేవలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లకు మాత్రమే అనుమతి లభించింది. ఆర్ బిఐ క్యాలెండర్ ప్రకారం చూస్తే తెలంగాణ సర్కారు ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మే వరకూ 8000 కోట్ల రూపాయలు రుణాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాదు..వచ్చే పది నెలల పాటు కూడా తెలంగాణ రాష్ట్రం అప్పులు చేయటం అంత సులభంకాదనే అభిప్రాయం అదికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ఎందుకంటే అప్పులకు సంబందించి తెలంగాణ సర్కారు, కేంద్రం మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తుంది. ప్రభుత్వం ఇచ్చే వివరణలపై కేంద్రం ఏ మాత్రం సంతృప్తి చెందటంలేదు. దీంతో భవిష్యత్ రుణాలపై కూడా అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితి నుంచి తెలంగాణ సర్కారు ఎలా బయటపడుతుంది అన్నది వేచిచూడాల్సిందే. ప్రగతిపథంలో పయనిస్తున్న రాష్ట్రాన్ని దెబ్బకొట్టేందుకే కేంద్రం రుణాల విషయంలో కావాలనే అడ్డంకులు కల్పిస్తోందని తెలంగాణ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆర్ బిఐ వేలం ద్వారా రుణాలు పొందే అవకాశం ఆగిపోవటంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధుతోపాటు రుణమాఫీ కార్యక్రమం, మన ఊరు-మనన బడి వంటి కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించింది.
ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా సంపన్న రాష్ట్రం..మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని కెసీఆర్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అత్యంత కీలకమైన ఈ తరుణంలో అప్పులకు బ్రేకులు వేయటం అంటే తెలంగాణ సర్కారు ఇరకాటంలో పడినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే అవకాశం ఉన్న అన్ని చోట్లా ఛార్జీలను పెంచేశారు. అప్పులు లక్ష్యాలకు అనుగుణంగా సొంత వనరులు సమీకరించుకోవటం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దీంతో తెలంగాణ సర్కారు రాబోయే రోజుల్లో ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో వేచిచూడాల్సిందే. గతానికి భిన్నంగా తెలంగాణ సర్కారు భారీ ఎత్తున అప్పులు చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. అప్పులతోపాటు సర్కారు భూములను అమ్మకం ద్వారా టీఆర్ఎస్ నిధుల సమీకరణ ప్రయత్నాలు చేస్తోంది. అప్పులు..భూముల అమ్మకం విషయంలో ప్రతిపక్షంలో ఉండగా ఓ స్టాండ్..అధికారంలోకి వచ్చాక మరో స్టాండ్ అన్నట్లు టీఆర్ఎస్ వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి.