రేపో రేట్ తగ్గింపు సానుకూల అంశమే

గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ లో స్తబ్దత నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. మార్కెట్ కండిషన్స్ కు తోడు తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. మొత్తం మీద గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ లో డిమాండ్ అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే బాగా తగ్గింది అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హై ఎండ్ అపార్ట్మెంట్స్, ప్రీమియం సెగ్మెంట్ ఇళ్ల విషయంలో పెద్దగా ప్రభావం పడకపోయినా కూడా మిడ్ రేంజ్ నుంచి ఇతర విభాగాలపై మాత్రం ప్రభావం భారీగానే పడింది. శుక్రవారం నాడు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్ బిఐ) తీసుకున్న నిర్ణయం కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త గాడిన పడే అవకాశం ఉంది అనే అంచనాలు వెలువడుతున్నాయి.
ముఖ్యంగా ఇప్పటికే ఇల్లు కొనుగోలు చేసిన వారి ఈఎంఐ లు తగ్గటం ఒకటి అయితే...కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి భారం తగ్గనుంది. ఆర్ బిఐ శుక్రవారం నాడు ప్రకటించిన పరపతి విధానంలో రేపో రేట్ ను 50 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఇదే ఏడాది రెండు సార్లు 0 .25 బేసిస్ పాయింట్ల మేర రేపో రేట్ ను తగ్గించిన ఆర్ బిఐ ఈ సారి ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించటం కీలకంగా మారింది. తాజా నిర్ణయంతో రేపో రేట్ ఇప్పుడు ఆరు నుంచి 5 . 50 శాతానికి తగ్గింది. ఆర్ బిఐ బ్యాంకు లకు ఇచ్చే మొత్తాలపై వసూలు చేసే వడ్డీనే రేపో రేట్ అంటారు అనే విషయం తెలిసిందే. అందుకే ఆర్ బిఐ రేపో రేట్ పెంచితే వడ్డీ రేట్లు పెరుగుతాయి...తగ్గిస్తే రేట్లు తగ్గుతాయి. ద్రవ్యోల్భణం నియంత్రణలో ఉండటంతో వృద్ధి రేట్ కు ఊతం ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
రేపో రేట్ 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో కొంత మేర డిమాండ్ పెరిగే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మిడ్ రేంజ్, అందుబాటు ధరల విభాగాల్లో డిమాండ్ పుంజుకునే అవకాశం ఉంది అనే లెక్కలు ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందుతాయి కాబట్టి డెవలపర్ల కు కూడా ఇది ఊరట కలిస్తుంది అని చెప్పొచ్చు. ఆర్ బిఐ తాజా నిర్ణయం రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఎంత మేర జోష్ తేసుతుంది అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. రేపో రేట్ తో పాటు సిఆర్ఆర్ కూడా తగ్గించటంతో మార్కెట్ లో అందుబాటులోకి వచ్చే నగదు నిల్వలు పెరగనున్నాయి.