Telugu Gateway
Telangana

కన్నుమూసిన మీడియా దిగ్గజం

కన్నుమూసిన మీడియా దిగ్గజం
X

చెరుకూరి రామోజీ రావు అంటే ఒక బ్రాండ్. అటు మీడియా తో పాటు ఎన్నో రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. బౌతికంగా రామోజీరావు లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ముద్ర చెరిగిపోయేది కాదు అనే చెప్పొచ్చు. ఒక పల్లెటూరు, రైతు కుటుంభం నుంచి వచ్చిన రామోజీ రావు మీడియా రంగంలోనే కాకుండా..పలు విభాగాల్లో ఎన్నో సంచలనాలను నమోదు చేశారు. ఒకే సారి పెద్ద ఎత్తున శాటిలైట్ ఛానెల్స్ ను ప్రారంభించటంతో దేశంలో కూడా అందరి దృష్టి రామోజీరావు పై పడింది అనే చెప్పొచ్చు. ఈనాడు పత్రిక గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు లో నంబర్ వన్ గా కొనసాగుతూ వస్తోంది. రామోజీ రావు ను కొంత మంది భారతదేశపు 'రూపర్ట్ మర్డోక్'గా అభివర్ణిస్తారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. తెలుగు లోగిళ్ళలో ఈనాడు పత్రిక ఉన్నంత కాలం...దేశ సినిమా పరిశ్రమకు వన్ స్టాప్ షాప్ లాంటి ఫిల్మ్ సిటీ ని నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నంతకాలం ఆయనకు మరణం లేదు అనే చెప్పొచ్చు.

1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీ ప్రస్థానం ఎందరిలోనే స్ఫూర్తి నింపింది అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు అనే చెప్పాలి. 1983లో ఉషాకిరణ్‌మూవీస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ని స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. ఈ బ్యానర్‌లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ సహా 80కి పైగా విభిన్న భాషల్లో సినిమాలు వచ్చాయి. మీడియా రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గాను 2016లో ఆయనకు భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మవిభూషణ్‌తో సత్కరించారు. రాష్ట్రం ఎప్పుడు సమస్యల్లో చిక్కుకున్నా తన వంతు సాయం అందించే విషయంలో రామోజీ రావు ముందువరసలో ఉండే వాళ్ళు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రామోజీ రావు కోవిడ్ రిలీఫ్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్‌కు రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతే కాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పునరావాసం అనేక పనులు చేయించారు. రామోజీ రావు మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

Next Story
Share it