బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాంచందర్ రావు !

తెలంగాణాలో బీజేపీ అసలు అధికారంలోకి రావాలని కోరుకుంటుందా?. లేక ఆ పార్టీ ప్లాన్స్ వేరే ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు ఇదే ఆ పార్టీలోని కొంత మంది నాయకులకు కూడా వస్తున్న సందేహం. సరిగ్గా మొన్నటి ఎన్నికలకు ముందు బీజేపీ హై కమాండ్ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తొలగించటం అప్పటిలో చాలా మందిని షాక్ కు గురి చేసింది. బండి సంజయ్ ను అలా కొనసాగించి ఉంటే బీజేపీ అధికారంలోకి రాకపోయినా కూడా హంగ్ పరిస్థితి వచ్చేది అన్నది ఎక్కువ మంది అంచనా. బండి సంజయ్ ను తొలగించటం..బిఆర్ఎస్ పై అప్పటికే తీవ్ర స్థాయికి చేరిన వ్యతిరేకత వంటికి కాంగ్రెస్ పార్టీ కి బాగా కలిసివచ్చిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు ఇస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇది పార్టీ లో కొత్త జోష్ తెస్తుంది అని కూడా ఎక్కువ మంది భావించారు. ఈటల పేరు ప్రకటించటమే తరువాయి అన్న చందంగా ఈ ప్రచారం జరిగింది.
కానీ బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పేరును ఖరారు చేసింది. రాంచందర్ రావు బీజేపీ సీనియర్ నేత..వివాదరహిడు కూడా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే తెలంగాణ వంటి రాష్ట్రంలో పార్టీ నాయకులు...క్యాడర్ లో జోష్ నింపి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చే విషయంలో రాం చందర్ రావు ఎంత మేర ప్రభావం చూపించగలరు అన్నదే ఇప్పుడు పార్టీ నాయకుల ముందు ఉన్న ప్రశ్న. మొదటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న ఈటల రాజేందర్ పేరు చివరి వరకు ఉన్నా కూడా అయన కు ఛాన్స్ దక్కలేదు. సుదీర్ఘకాలం బిఆర్ఎస్ లో ఉన్న ఈటల రాజేందర్ కు తెలంగాణ రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. ఈటలకు ఛాన్స్ ఇచ్చి ఉంటే బీజేపీ లో జోష్ తీసుకువచ్చే ప్రయత్నం చేసేవాడు అనే అభిప్రాయం కూడా ఎక్కువ మంది నేతల్లో ఉంది. అయితే ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి దక్కకుండా చేయటంలో బీజేపీ లోని రాష్ట్ర సీనియర్ నేతలు చక్రం తిప్పినట్లు ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఫలించినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
కొత్త అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేసిన రాంచందర్ రావు పై ఎవరికీ ఫిర్యాదులు లేకపోయినా కూడా ఒక వైపు రాజకీయంగా బిఆర్ఎస్ అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఈ ఎంపిక ఆ పార్టీ నాయకులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. అధికార కాంగ్రెస్ లో అంతా గందగోళంగా ఉంది. మరో వైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ మరో వైపు రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ రాజకీయాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేయకపోగా..కొత్త అధ్యక్షుడి ఎంపిక ద్వారా ఎలాంటి సంకేతాలు పంపిందో అర్ధం కావటం లేదు అని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. వాస్తవానికి ఇప్పుడు బీజేపీ కి రాజకీయంగా ఎంతో అనుకూల వాతావరం ఉంటే దాన్ని హై కమాండ్ ఇంతదారుణంగా చెడగొడుతుంది అని ఊహించలేదు అని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు.