రేప్ కేసు నిందితుడు రాజు ఆత్మహత్య
కలకలం రేపిన సైదాబాద్ రేప్ కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్ళ చిన్నారిని రేప్ చేసి, హత్య చేసిన రాజు కోసం ఓ వైపు పోలీసులు పెద్ద ఎత్తున గత కొన్ని రోజుల నుంచి గాలిస్తున్నారు. దీని కోసం పలు టీమ్ లు కూడా ఏర్పాటు చేశారు. మరో వైపు నిందితుడి ఆచూకి చెపితే పది లక్షల రూపాయల నజరానా కూడా ప్రకటించారు. అయితే గురువారం ఉదయమే రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌వద్ద రాజు మృత దేహం లభ్యమైంది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ ట్వీట్ చేశారు.
రైల్వే ట్రాక్‌పై దొరికిన మృతదేహంపై మౌనిక అని పచ్చబొట్టు ఉండటంతో నిందితుడు రాజు అని నిర్థారించుకున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి గురువారం (సెప్టెంబర్ 9) చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లి నిందితుడు రాజు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. చిన్నారి తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండాకు చెందిన గిరిజన కుటుంబం. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి సింగరేణి కాలనీలో నివసిస్తోంది.