కెటీఆర్ గతం మర్చిపోయారా..రాజాసింగ్ కౌంటర్
ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు వంటి అంశాలపై రాజ్యసభలో మాట్లాడేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ ఎంపీలతోపాటు మొత్తం పది మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయటంపై మంత్రి కెటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది..ప్రతిపక్ష పార్టీల గొంతు ఎందుకు నొక్కేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు. దీనికి బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసలు మీకు ట్వీట్ చేసే అధికారమే లేదు..గతం మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజే ముగ్గరు బిజెపి ఎమ్మెల్యేలను మొత్తం సమావేశాల నుంచి బహిష్కరించిన విషయం మర్చిపోయారా అంటూ రాజాసింగ్ ట్విట్టర్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు. మీరే కదా ఈ పని చేసింది.
ఇవాళ మీరు మాట్లాడతారా సస్పెండ్ చేయటం గురించి అంటూ ప్రశ్నించారు. సభ్యులను ఎందుకు సస్పెండ్ చేశారు అంటూ ప్రశ్నలు వేయటం ద్వారా మిమ్మల్ని మీరు అపహస్యం చేసుకోకండి అంటూ ఎద్దేవా చేశారు. కెటీ రామారావు ట్విట్టర్ మ్యాన్ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.ధరలు ఎక్కడ పెరిగాయి..ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు అంటూ ఓ వీడియోలో రాజాసింగ్ ప్రశ్నించారు. కాలు విరిగింది అని ఇంట్లో కూర్చున్నావు కదా..ఇదే విషయం ట్వీట్ చేస్తూ..ఏదైనా మంచి సినిమాలు ఉంటే చెప్పమన్నారు కదా..నేను ఓ మంచి సినిమా చెబుతా చూస్కో అంటూ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడమని సలహా ఇచ్చారు రాజాసింగ్. లేదంటే ప్రధాని మోడీ, అటల్ బిహరి వాజ్ పేయిల గురించి చూడమన్నారు.