Telugu Gateway
Telangana

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ముసలం

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ముసలం
X

తెలంగాణ బీజేపీ లో కలకలం. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక వ్యవహారం తెలంగాణ బీజేపీ లో దుమారం రేపుతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు దక్కుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణాలో పెద్ద ఎత్తున ఉన్న బిసి సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ ను ఎంపిక చేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఛాన్స్ లు మెరుగు అవుతాయని పెద్ద ఎత్తున లెక్కలు వేశారు. కానీ బీజేపీ అధిష్ఠానం మాత్రం మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ను ఈ పదవికి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ కి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి అంద చేశారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయాలని నిర్ణయించుకుని దరఖాస్తు తీసుకుంటే...దీనిపై సంతకాలు పెట్టకుండా పార్టీ నాయకులు బెదిరించారు అని రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ కి రాజీనామా చేసినందున ఎమ్మెల్యేగా డిస్ క్వాలీఫై చేసేలా అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ పంపమని కోరినట్లు రాజాసింగ్ మీడియా కు తెలిపారు.

2014 నుంచి తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానన్నారు. పార్టీ కోసం పని చేసి టెర్రరిస్టుల హిట్ లిస్ట్‌లో ఉన్నానని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదని పార్టీలోని కొందరు పెద్ద నాయకులు కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాను బీజేపీలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. తనకు మద్దతు ఇస్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ తన అనుచరులను కొందరు బెదిరించారని ఆరోపించారు. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తాను ముహూర్తం సైతం చూసుకున్నానని తెలిపారు. మీకో దండం.. మీ పార్టీకో దండమని బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన ఎంపీ ఈటల రాజేందర్ మాత్రం ఈ అంశంపై ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిఫారసు తోనే రాంచందర్ రావు కు పదవి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే రాజాసింగ్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. వ్యక్తుల ఆధారంగా తమ పార్టీ లో నిర్ణయాలు ఉండవని...ఏదైనా పార్టీ కోణంలో ఉంటుంది అని పేర్కొన్నారు. రాజాసింగ్ రాజీనామా లేఖను కేంద్ర నాయకత్వానికి పంపే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది.

Next Story
Share it