Telugu Gateway
Telangana

యూపీ యువతి హంగామా

యూపీ యువతి హంగామా
X

రైలు పట్టాలపై ఒక యువతి చేసిన హంగామా పెద్ద కలకలమే రేపింది. రైళ్లు వెళ్లాల్సిన పట్టాలపైకి కారు తీసుకెళ్లి ఆమె చేసిన హడావుడి చూసి ఆ ప్రాంత ప్రజలు ఒకింత షాక్ కు గురి అయ్యారు. అసలు ఎవరు ఇలా చేస్తున్నారు...ఎందుకు చేస్తున్నారో అర్ధం కాక కొంత సేపు ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ఇలా రైలు పట్టాలపై కారు నడిపిన యువతిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నం చేయగా..అందులో ఉన్న యువతి ఏకంగా కత్తి తీసి స్థానికులను బెదిరించే ప్రయత్నం చేసింది. పట్టాలపై కారు నడుపుతున్నది ఒక యువతి అని తెలుసుకున్న తర్వాత స్థానికులు మరింత అవాక్కు అయ్యారు. రంగారెడ్డి జిల్లా నాగులపల్లి నుంచి శంకర్ పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఈ విషయాన్నిగమనించిన నాగులపల్లి గ్రామస్తులు యువతి నడుపుతున్న కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు.

కానీ కారును రైలు పట్టాలపై వేగంగా నడిపి ముందుకు సాగింది. దీంతో గ్రామస్తులు వెంటన రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ మార్గంలో రైళ్లను నిలిపివేశారు. ఆమె దెబ్బకు రెండు గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఆ యువతి పై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. నాగులపల్లి సమీపంలో రైలు పట్టాలపై కారు నిలిపిన మహిళను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెతోపాటు కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.పట్టాలపై కారు నడిపిన యువతి పేరు రవికా సోని గా పోలీసులు గుర్తించారు. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. హైదరాబాద్‌లోని ఒక సంస్థలో ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తుందన్నారు. ఇటీవల ఆమెను విధుల నుంచి తొలగించారని సమాచారం. నాగులపల్లి- శంకర్‌పల్లి మధ్య సుమారు ఏడు కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై ఆమె కారు నడిపిందన్నారు.అయితే ఆమె మద్యం సేవించడం లేదా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ విధంగా వ్యవహరించిదా? లేకుంటే మరేమైనా అనారోగ్య కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందుకోసం ఆమెను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రీల్స్ కోసమే ఆమె నిర్వాకానికి పాల్పడినట్లు కూడా చెపుతున్నారు.

Next Story
Share it