తెలంణాలో సీఎం లేరు..రాజే ఉన్నారు
టీఆర్ఎస్ తో పొత్తు కోరితే పార్టీ నుంచి సస్పెండే
బిజెపి, టీఆర్ఎస్ తో పొత్తు కోరుకునే వాళ్లు అందులోకే వెళ్ళొచ్చు
తెలంగాణను దోపిడీ చేసిన వారిని వదిలేది లేదు
ఎంత పెద్దవారికైనా టిక్కెట్లకు అదే రూల్
వరంగల్ డిక్లరేషన్ కు నాది పూచీ
రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
సింపుల్ గా..సూటిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ రైతు సంఘర్షణ సభలో రైతుల అంశాలతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కూడా పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రి లేరు..రాజే ఉన్నారంటూ సీఎం కెసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రులు ప్రజల మాట విని నిర్ణయాలు తీసుకుంటారని..కానీ రాజులు మాత్రం తమకు తోచిన నిర్ణయాలు తీసుకుంటారన్నారు. తెలంగాణలో ఇప్పుడు రాజుల పాలనే నడుస్తోందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బిజెపితో లాలూచీపడే నేతలు పార్టీని వెళ్లొచ్చని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని కోరేవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్, బిజెపిలతో స్నేహం కోరుకునే తమకు అక్కర్లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో నేరుగా టీఆర్ఎస్ ను ఓడించేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఎన్నికల సమయంలో టిక్కెట్ల అంశం తెరపైకి వస్తుందని..ఎవరు రైతులు పక్కన..పేదల పక్కన..తెలంగాణ ప్రజల పక్కన నిలబడి పోరాటం చేస్తారో వారికి మాత్రమే టిక్కెట్లు దక్కుతాయని..అలా కాకుండా ఎంత పెద్దవారైనా సరే వారికి మినహాయింపులు ఉండవన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రజల ఆకాంక్షలు గుర్తించి తెలంగాణ ఇచ్చింది కానీ..ఒక వ్యక్తి కోసం కాదన్నారు. కానీ తెలంగాణ కల నేరవేర్చకుండా రాష్ట్రాన్ని దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రశ్నలేదన్నారు. అలాంటి వారితో కలిసే ప్రశ్నేలేదన్నారు. పొత్తు ఉన్నది టీఆర్ఎస్, బిజెపిల మధ్యే అన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన నల్లచట్టాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని విమర్శించారు. తెలంగాణలో నడుస్తున్నది బిజెపి రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. దేశంలో పలువురిపై ఈడీ, ఐటీలను పంపిన కేంద్రం తెలంగాణను దోచుకున్న టీఆర్ఎస్ పైకి మాత్రం ఎవరిని పంపటం లేదంటే దీని అర్ధం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా..ఏ అంశం అయినా తాను ఎప్పుడు కోరితే అప్పుడు ఇక్కడకు రావటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు రాహుల్ గాంధీ.