తెలంగాణాలో లో పార్టీ కి నష్టమే అన్న వ్యాఖ్యలు

హాట్ సీట్ లో కూర్చున్న వాళ్లకు అధిష్టానం అండ లేదు అంటే కాంగ్రెస్ పార్టీ లో ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు ఆయన సృష్టించుకున్న సమస్యలు తప్ప...సీనియర్ మంత్రుల నుంచి కానీ..పార్టీ నుంచి పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు అని...కానీ ఇక నుంచి సీన్ మారే అవకాశం ఉంది అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో సాగుతోంది. దీనికి ప్రధాన కారణం తాజాగా ఢిల్లీ లో చోటు చేసుకున్న పరిణామాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తో తనకు ఎలాంటి గ్యాప్ లేదు అని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. తాను ఈ విషయంలో ఎవరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే తాజా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ బిగ్ షాక్ ఇచ్చారు అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో సాగుతోంది. ఒక్క షాక్ మాత్రమే కాదు.. సీఎం కు ఇంత కంటే అవమానం ఏమి ఉంటుంది అని..గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవు అని ఆ పార్టీ వర్గాలే చెపుతున్నాయి. ఢిల్లీలో ముఖ్యమంత్రిని పెట్టుకుని రాహుల్ గాంధీ కేవలం పార్టీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జి కె సి వేణుగోపాల్ తో పాటు పీసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను ఫ్యామిలి తో సహా కలిశారు. వీళ్ళిద్దరితో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ తో పాటు పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించారు. కానీ ఈ సమయంలో ఢిల్లీ లోనే ఉన్న రేవంత్ రెడ్డి కి మాత్రం పిలుపు రాలేదు.
ఇది కావాలనే చేశారు తప్ప మరొకటి కాదు అనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. మొన్నటి ఎన్నికల్లో పీసిసి ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ ను గెలిపించిన నాయకుడిగా..ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ కు ఇది దారుణ అవమానమే అన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యంగా రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు మంత్రులు కానీ..కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ రేవంత్ రెడ్డి ని ధిక్కరించి వ్యవహరించినట్లు ఎక్కడా లేదు. అయితే ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు అని..లెక్క మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనే అభిప్రాయాన్ని ఒక సీనియర్ నేత వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగాల్సిన తరుణంలో ఏడాదిన్నర కావస్తున్నా కూడా పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఉంది. దీనికి తోడు మంత్రుల మధ్య సఖ్యత ఉన్న దాఖలాలు కూడా లేవు అని...ఎవరి ఇష్టం వాళ్లదే అన్న చందంగా ఎక్కువ మంది మంత్రులు వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో కూడా ఉంది.
ఏడాదిన్నర రేవంత్ రెడ్డి పాలన చూస్తున్న వాళ్ళు మాత్రం కారణాలు ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక మారదు అనే నిశ్చిత అభిప్రాయానికి వచ్చేశారు. కాంగ్రెస్ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో కూడా లేదు. పోనీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయినా పాలన సరిగా జరిగేలా చూసుకుంటూ పార్టీ...పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుందా అంటే అదీ లేదు. కర్ణాటక ప్రభుత్వంలో సమస్యలు..తెలంగాణ లో కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా చాలా మంది నేతలు రాహుల్ గాంధీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఆయన ఇంకా సీరియస్ రాజకీయాలు చేస్తున్న దాఖలాలు లేవు అనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు జరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అనే చర్చ సాగుతోంది.