Telugu Gateway
Telangana

మద్యం స్కాం చుట్టూ 'పవర్' ఫుల్ వ్యక్తులు!

మద్యం స్కాం చుట్టూ పవర్ ఫుల్ వ్యక్తులు!
X

కావటానికి అది ఢిల్లీ మద్యం స్కాం అయినా అంతా తెలుగు రాష్ట్రాల రాజకీయం చుట్టూనే తిరుగుతోంది. ఈ మద్యం స్కాం లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పవర్ ఫుల్ వ్యక్తులు ఉన్నారు. ఇప్పటికే ఈ స్కాములో అరెస్ట్ అయిన ఆరోబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనే పేరుంది. అంతే కాదు ఆ పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కి దగ్గర బంధువు కూడా. ఇది ఆంధ్ర ప్రదేశ్ విషయం అయితే తెలంగాణ కు వస్తే ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరే అధికారికంగా ఈడీ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. దీంతో ఈ స్కాములో ఢిల్లీలోని అధికార ఆప్ నేతలతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పవర్ ఫుల్ వ్యక్తులు ఇందులో ఉన్నట్లు అయింది అనే చర్చ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు మద్యం అత్యంత కీలక ఆదాయ వనరుగా ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది. తెలంగాణ లో పాత సిస్టం కొనసాగుతోంది. సౌత్ గ్రూప్ పేరుతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారంతా కలిసి అప్ కు వంద కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారు అంటే వీళ్లకు ఎంత లాభం లేకపోతే ఇంత మొత్తం ఇవ్వగలరు అనే సందేహాలు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన శరత్ చంద్రా రెడ్డి కి ఐదు రిటైల్ జోన్స్ దక్కాయి. ఆయనతో పాటూ రాఘవ మాగుంట కు కూడా రెండు జోన్లు దక్కాయి. అయితే శరత్ చంద్రా రెడ్డికి దక్కిన జోన్స్ లో మొత్తం పెట్టుబడులు ఎవరెవరు పెట్టారు...ఎవరికి ఎంత వాటాలు ఉన్నాయనే విషయం ఇంకా బయటకు రావాల్సి ఉంది అని చెపుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఎవరి కోసం లాబీ చేశారు...లేక రిటైల్ జోన్స్ లో పెట్టుబడులు పెట్టారా అన్నదానిపై స్పష్టత కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రకంపనలు రేపుతోంది. మత్తు ఎక్కించే మద్యం చుట్టూ ఇప్పుడు పవర్ ఫుల్ వాళ్ళు ఉన్నారు.

Next Story
Share it