Telugu Gateway
Telangana

కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బిఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా?!

కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బిఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా?!
X

ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా!

బిఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే రేవంత్ రెడ్డి సర్కారు చర్యలు తీసుకోవటంలో విఫలం అయింది అనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బిఆర్ఎస్ ఇంకా టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అన్న తరహాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణం అవుతున్నాయి. ప్రభుత్వానికి ఇంతకంటే పరువు తక్కువ విషయం మరొకటి ఉంటుందా అని కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన వ్యాఖ్యలతో ప్రభుత్వ పరువు తీసినట్లు ఉంది అనే చర్చ సాగుతోంది. తెలంగాణలో అత్యంత కీలకమైన హోమ్ శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ శాఖ సీఎం దగ్గరే ఉంది. ఈ తరుణంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బిఆర్ఎస్ వాళ్లే ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అన్నట్లు మాట్లాడటం ప్రభుత్వ పరువు తీయటం తప్ప మరొకటి కాదు అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఎదులాపురం మున్సిపల్ ఎన్నికలపై అధికారులతో తాను నిర్వహించిన సమీక్షలోని విషయాలు బయటకు రావటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇవి విన్నారా లేక ఎలా బయటకు వచ్చాయో విచారణ జరిపిస్తామన్నారు. అదే సమయంలో ఇవి అన్నీ చూస్తుంటే ఇంకా కూడా వాళ్ళ దగ్గర ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్ మెంట్ ఉన్నది అని నిర్ధారణ అవుతుంది అన్నారు. ఎన్ని ఎక్విప్ మెంట్స్ ఏ ఏ మామిడి తోటల్లో...ఏ ఏ ఫార్మ్ హౌస్ ల్లో ఉన్నాయో ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించి ...ఇంకా దొంగ తనంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంత మంది మాటలు వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తుంది. వాళ్ళను చట్ట రీత్యా తగు చర్యలు తీసుకుంటుంది అని ప్రకటించారు మంత్రి పొంగులేటి.

గతంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన ప్రకటనలు ఏవీ కూడా అమల్లోకి రాలేదు. ఫార్ములా ఈ రేస్ కేసు లో బాంబు లు పేలతాయి అంటూ కూడా ఆయన చేసిన హంగామా ఆ తర్వాత అంతా తుస్ అంటూ తేలిపోయింది. పంచాయతీ ఎన్నికల తో పాటు ఇతర శాఖలకు చెందిన అంశాలపై పొంగులేటి ప్రకటనలు చేయటంతో పీసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా బిఆర్ఎస్ టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అన్నట్లు మాట్లాడటం చూసి అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. ఒక వేళ నిజంగా అలాంటిదే జరిగితే అది ప్రభుత్వ వైఫల్యం కింద కే వస్తుంది తప్ప మరొకటి కాదు. పొంగులేటి శ్రీవాస రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ పరువు పోయినట్లు అయింది అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it