Telugu Gateway
Telangana

పొంగులేటికి బిగ్ షాక్ !

పొంగులేటికి బిగ్ షాక్ !
X

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరారు. గెలిచారు..మంత్రి అయ్యారు. కీలక శాఖలు కూడా దక్కాయి. ఇంత వరకు ఓకే. కానీ గత ఏడాదిన్నర కాలంలో మంత్రిగా ఆయన చేసిన ప్రకటనలు ఎన్నో మిస్ ఫైర్ అయ్యారు. ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం కాలేదు. ప్రభుత్వం తరపున సియోల్ లో పర్యటించిన సమయంలో కూడా తాము హైదరాబాద్ లో దిగే లోగా బాంబు లు పేలతాయి అంటూ ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన చెప్పిన బాంబు లు ఏవీ పేలలేదు. మరో వైపు తన శాఖకు సంబంధం లేకపోయినా కూడా ప్రభుత్వంలో ఇతర శాఖలకు చెందిన ప్రకటనలు ఆయనే చేస్తూ విమర్శలు ఎదుర్కొన్నారు. అనధికారికంగా ప్రభుత్వంలో తానే నంబర్ టూ అని చెప్పుకునేందుకు ఆయన నిత్యం ఏదో ఒక హడావుడి చేస్తుంటారు అని కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయన ఇతర మంత్రుల వ్యవహారాల్లో తలదూర్చి ప్రకటనలు చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏడాదిన్నర కాలంలో ఎవరికీ రాని వార్నింగ్ పీసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి వచ్చింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది మంత్రి కొనితెచ్చుకున్న సమస్య తప్ప మరొకటి కాదు అనే వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

ఎప్పటి లాగానే మంత్రి శ్రీనివాస రెడ్డి ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడారు. ఈ ఎన్నికల బాధ్యత చూడాల్సిన పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖతో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి ఏ మాత్రం సంబంధం లేదు. ఈ శాఖ చూస్తున్నది మరో మంత్రి సీతక్క. గతంలో కూడా పొంగులేటి పంచాయతీ ఎన్నికలపై ప్రకటనలు చేశారు. అవి కూడా వాస్తవరూపం దాల్చలేదు. ఇటీవల ఆయన మరో సారి ఇదే అంశంపై మీడియాతో మాట్లాడారు. దీనిపైనే పీసీసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌ లో నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ మహేష్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడిన ఎన్నికలపై పొంగులేటి ప్రకటనను టీపీసీసీ చీఫ్‌ తప్పుబట్టారు. ఒకరి మంత్రిత్వ శాఖపై మరొకరు మాట్లాడటమేంటని ప్రశ్నించారు.

అధిష్టానంతో సంప్రదించకుండా ప్రకటనలు చేయొద్దని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్ సూచించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించటమే కాకుండా...ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని తెలిపారు. త్వరలో ఎన్నికల తేదీలు ప్రకటన ఉంటాయని అన్నారు. కేబినెట్‌ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అనంతరం సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే పొంగులేటి అధిష్టానాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా మాట్లాడతారని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ ప్రశ్నించారు.

Next Story
Share it