Telugu Gateway
Telangana

బీజేపీ నుంచి వలసలు ఆగుతాయా

బీజేపీ నుంచి వలసలు ఆగుతాయా
X

సినిమాల్లో అయితే డైలాగులతో నడిచిపోతుంది. కానీ రాజకీయాల్లో ఎలాంటి యాక్షన్స్ లేకుండా కేవలం డైలాగులతోనే అంటే అది సాధ్యం కాదు అని చెప్పొచ్చు. శనివారం నటి ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ సభలో చెప్పిన మాటలతో నీరసించి పోయిన తెలంగాణ బీజేపీ తిరిగి గాడిన పడుతుందా?. పాత జోష్ ను తెచ్చుకోవటం సాధ్యం అవుతుందా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని నిన్న మొన్నటివరకు తహతహ లాడిన బీజేపీలో అంతర్గత కుమ్ములాటలతో ఒక్కసారిగా నిస్తేజం అలుముకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ బండి సంజయ్ ని తప్పించటంతో పార్టీ మరింత గందరగోళంలో పడినట్లు అయింది. ఈ తరుణంలో ప్రధాని మోడీ వరంగల్ పర్యటన ఆ పార్టీ కి అత్యంత కీలకంగా మారింది అనే చెప్పాలి. అయితే మోడీ మాటలు బీజేపీ కి రాజకీయంగా ఎంత మేర పనికివస్తాయనే విషయం భవిష్యత్ లో కానీ తేలదు. తెలంగాణ రాజకీయం విషయానికి వస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం కీలకంగా మారింది. స్వయంగా బీజేపీ నేతలే ఈ కేసు లో తెలంగాణ సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తప్పదు అంటూ ప్రకటనలు చేశారు. కానీ ఈ స్కాం కు సంబంధించి కీలక వ్యక్తులు అందరూ అరెస్ట్ అయ్యారు కానీ...విచారణ సంస్థలు ఇప్పటివరకు ఎమ్మెల్సీ కవిత జోలికి రాలేదు. ఇదే అంశంపై బీజేపీ నేతలు కవిత అరెస్ట్ జరిగితే తప్ప తెలంగాణాలో బీజేపీ ని నమ్మరు అని ప్రకటించిన విషయం తెలిసిందే.

వరంగల్ పర్యటన సందర్భంగా మాట్లాడిన మోడీ సహజంగా రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్ట్ లు ..ఇతర అంశాల మధ్య సంబంధాలు ఉంటాయని...కానీ అవినీతి చేయటం కోసం రెండు రాష్ట్రాలు కలిశాయని ఢిల్లీ లిక్కర్ స్కాం పేరు ప్రస్తావించకుండా మాట్లాడారు. అంతే కాదు..కెసిఆర్ సర్కారు చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ లో అవినీతి రాజ్యం ఏలుతుంది అని...దేశంలోనే అత్యంత అవినీతి సర్కారు కెసిఆర్ ది అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఈ ప్రభుత్వం నాశనం చేసింది అని...నిత్యం మోడీని..కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుంది అని విమర్శలు గుప్పించారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ...ప్రతిపక్ష నేతలు ఆరోపించినట్లు ప్రధాని మోడీ కూడా కేవలం ఆరోపణలు చేసి వెళితే ఏమి ఉపయోగం ఉంటుంది...సాధికారికంగా ప్రతి ప్రాజెక్ట్ లో అవినీతి అని చెప్పినప్పుడు ఒక దాంట్లో కాకపోతే ఒక అంశం లో అయినా చర్యలు ఉంటాయని ప్రజలు భావిస్తారు కదా?. అలాంటిది ఏమీ లేకుండా కేవలం విమర్శలు చేసి వదిలేస్తే బీజేపీ ని నమ్మటం జరిగే పని కాదు అని చెప్పొచ్చు. అటు మోడీ తో పాటు ఇటు కేంద్ర మంత్రి,, తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కూడా సీఎం కెసిఆర్ హామీలు ఇచ్చి మోసం చేసిన అంశాలను ప్రధానంగా వరంగల్ సభలో ప్రస్తావించారు. మరి మోడీ చెప్పిన మాటలతోనే బీజేపీ నుంచి సాగుతున్న వలసలకు బ్రేకులు పడతాయా...బీజేపీ లో తిరిగి పాత జోష్ వస్తుందా అంటే కొద్దికాలం వేచిచూడాల్సిందే.

Next Story
Share it