Telugu Gateway
Telangana

కార్లు ..ఆఫీస్ అద్దాలు ధ్వంసం

కార్లు ..ఆఫీస్ అద్దాలు ధ్వంసం
X

తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా టెలిఫోన్ ట్యాపింగ్ అంశం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐ బి ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగివచ్చిన తర్వాత ఈ విచారణ మరింత ఊపు అందుకుంది. ట్యాపింగ్ బాధితుల నుంచి కూడా ఈ కేసు విచారిస్తున్న సిట్ అధికారాలు స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులు అయితే గత బిఆర్ ఎస్ ప్రభుత్వంపై ముఖ్యంగా మాజీ సీఎం కెసిఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పై నేరుగా విమర్శలు చేస్తున్నారు. మీడియా ముందు ఆన్ రికార్డు వీళ్ళ పేర్లు కూడా చెపుతున్నారు. దీనిపై మీడియా లో కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో బిఆర్ఎస్ కార్యకర్తలు శనివారం హైదరాబాద్ లో మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. ఆఫీస్ ముందు ఉన్న కార్లను ధ్వంసం చేయటంతో పాటు ఆఫీస్ లోపల కూడా దాడి చేసి రాళ్లు రువ్వారు.

దీనికి ప్రధాన కారణం మాజీ మంత్రి కేటీఆర్ పై మహాన్యూస్ లో ట్యాపింగ్ కు సంబంధించి వచ్చిన వార్తలే. ఇదే అంశంపైన మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించారు. ‘గత కొన్ని నెలలుగా కొంత మంది నీచులు, జర్నలిస్టుల వేషంలో మాయమాటలు చెప్పుకుంటూ మీడియా హౌసులు నడుపుతూ, నాపై, మా పార్టీ నాయకత్వంపై విషాన్ని వెదజల్లుతున్నారు. వాళ్ల అభిప్రాయాలు , వారి ఉనికి నేను ఎంత మాత్రం పట్టించుకోను కానీ, ఈ పునరావృతమైన వ్యక్తిత్వ హననం కారణంగా నా కుటుంబం, స్నేహితులు, పార్టీ సహచరులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాళ్లందరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను. ఈ పద్దతిలో జరిగే ప్రయత్నాల వెనుక ఎవరు ఉన్నారో నాకు బాగా తెలుసు – వాళ్లను తగిన విధంగా ఎదుర్కొంటాను.’ అని పేర్కొన్నారు.

ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. గతంలో కూడా కేటీఆర్ తనపై తప్పుడు వార్తలు రాసిన వాళ్ళను..ఆరోపణలు చేసిన వాళ్లపై లీగల్ నోటీసు లు ఇచ్చారు. కోర్టు ల్లో కేసులు కూడా వేశారు. కానీ ఈ సారి మాత్రం ఏకంగా ఒక మీడియా ఛానెల్ పై బిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఇది ప్రమాదకరమైన ధోరణే అని చెప్పాలి. ఏ మీడియాలో అయినా తప్పుడు వార్తలు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఇలా దాడికి దిగటం ద్వారా బిఆర్ఎస్ కొత్త సంప్రదాయానికి తెరతీసింది అనే చెప్పాలి.

Next Story
Share it