Telugu Gateway
Telangana

కోమటి రెడ్డి నిజంగానే ఆ పని చేస్తారా?!

కోమటి రెడ్డి నిజంగానే ఆ పని చేస్తారా?!
X

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప మంత్రి పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమా అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఈ నెల నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు దర్శకుడు హరీష్ శంకర్ ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఇంత వరకు ఎలాంటి వివాదం లేదు. మంగళవారం నాడు తెలంగాణ ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణాలో ఆయన సినిమాలు ఆడనివ్వబోమన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా తాను ఈ విషయం చెపుతున్నట్లు మరీ అధికారికంగా ప్రకటించారు. సినిమా టికెట్ రేట్ల పెంపు...స్పెషల్ షో ల విషయంలో అసెంబ్లీ లో చెప్పిన మాటల కే ఈ ప్రభుత్వం తూట్లు పొడిచింది...అది కూడా మీడియా మైకుల ముందు మాటలాడిన వాటిని ఎంత మేర అమలు చేస్తారో చూడాల్సిందే. అయితే కోమటిరెడ్డి వెంటకరెడ్డి తో పాటు ఇతర మంత్రులు...తెలంగాణ నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెపుతారా లేదా అన్నది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు.

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలే కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఎండిపోయాయి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు సందర్భం లేకుండా...పవన్ కళ్యాణ్ ఈ మాటలు ఎందుకు అన్నారో ఆ పార్టీ నాయకులకు కూడా అంతు చిక్కటం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో హడావుడి అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మరో మంత్రి నారా లోకేష్ లదే తప్ప...తాను ఎక్కడా కనపడటం లేదు అనే ఫ్రస్టేషన్ తప్ప ఇందుకు మరో కారణం ఉన్నట్లు కనిపించటం లేదు అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఈ సమయంలో తెలంగాణ ప్రజలపై చేసిన కామెంట్స్ ఏ మాత్రం అర్ధం లేనివి అని..రాజకీయంగా కూడా ఇప్పుడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేని సమయంలో ఆయన ఎందుకు ఈ మాటలు అన్నారు అన్నది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా కూడా ఉంది అనే చర్చ ఏపీ నేతల్లో సాగుతోంది.

తెలంగాణ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేసి ఇన్ని రోజులు దాటిన తర్వాత తాపీగా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మంగళవారం నాడు ఈ విషయంపై స్పందించటం పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ అంశంపై బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించి...పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..మంత్రులు వరసగా పవన్ కళ్యాణ్ పై ఎటాక్ స్టార్ట్ చేశారు. మరి తెలంగాణ అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెపుతారా..లేకపోతే మరి రాబోయే రోజుల్లో విడుదల కానున్న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు తిప్పలు తప్పవా అన్నది చూడాల్సిందే. గతంలో తెలంగాణా ప్రభుత్వం కూడా హరి హర వీర మల్లు తో పాటు ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపునకు కూడా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story
Share it