Telugu Gateway
Telangana

ఈ రాజకీయం తన కోసం కాదు అని సంకేతాలు ఇచ్చారా?!

ఈ రాజకీయం తన కోసం కాదు అని సంకేతాలు ఇచ్చారా?!
X

అనుకున్నది ఒకటి. అయింది మరొకటా?. అంతా ప్లాన్ ప్రకారమే వచ్చి...ఇప్పటికిప్పుడు డిసైడ్ అయినట్లు ప్రకటించటంలో నిజం ఉందా?. రాజకీయాలను దగ్గర నుంచి చూసే నాయకులు...ప్రజలు ఆ మాత్రం గ్రహించలేరా?. మొత్తానికి జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ గందరగోళాన్ని మరో సారి నిరూపించాయి అనే చెప్పొచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇతరుల ప్రమేయం లేకుండా మరో సారి తన పరువు తానే తీసుకున్నట్లు అయినట్లు కనిపిస్తోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడా?. ఆంధ్రాలోనే దిక్కులేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడేమి ముఖ్యమంత్రి అవుతాడు అంటూ ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతే ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తెలంగాణలో తాను చేయగలిగేది ఏమీ లేదు అన్నట్లు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరి ఇక్కడ పోటీ చేస్తామని ఎందుకు చెప్పినట్లు అన్న ప్రశ్న ఉదయించకమానదు. ఇక్కడి వాళ్లే ఉంటారు. ఇక నుంచి ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తాం. అవసరం అయితే తానే తెలంగాణాలో తిరుగుతా అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన పార్టీ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో సమావేశం ఏర్పాటు చేసుకోవటం అన్నదే. ఒక రాజకీయ పార్టీగా జనసేన అయినా..మరొకరు అయినా ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు. కానీ అసలు తెలంగాణ విషయంలో ఏ మాత్రం సంబంధం లేని జనసేన పార్టీ ..తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో అది కూడా రాష్ట్ర ఆవిర్భ దినోత్సవం రోజు మీటింగ్ ఏర్పాటు చేయటంతో ఇది అంతా ఒక పొలిటికల్ ఎజెండా తో సాగుతుంది అనే విషయం స్పష్టం అయింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో కూటమిగా ఉన్న తెలుగు దేశం, జనసేన, బీజేపీ లు త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయి అనే ప్రచారం సాగుతున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవటంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయ కోణంలోనే ఈ సభకు అనుమతి నిరాకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తనను అడ్డుకోవటానికి తెలంగాణ ఎవరి జాగీరు కాదు...తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం...ఇదేమైనా పాలస్తీనానా, పాకిస్థాన్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అన్ని కూడా బీజేపీ అజెండాలో భాగంగా చేసినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది.

ఇలా ప్రాంతీయ వాదాలు రెచ్చకొట్టుకుంటూ పోతే దేశంలో ప్రమాదంలో పడుతుంది అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ లో తాము ఏమి చేయబోతున్నది సంకేతాలు ఇచ్చినట్లు అయింది అనే చెప్పొచ్చు. అదే సమయంలో ఏపీలోనే సీఎం అయ్యే దిక్కులేదు.. ఇక్కడ సీఎం అవుతానా అని ప్రశ్నించటం ద్వారా తాను తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నది తన ప్రయోజనాల కోసం కాదు...వేరే వాళ్ల కోసమే అని స్పష్టమైన సంకేతం ఇచ్చారు అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ రాజకీయ వేడి కొనసాగే అవకాశం ఉంది.

Next Story
Share it