పవన్ కళ్యాణ్ పొత్తుల ఓపెన్ ఆఫర్ వెనక కథ ఏంటి?!
ఏపీలో పొత్తు పెట్టుకున్న తరహాలోనే తెలంగాణాలో కూడా టీడీపీ, జనసేన కలిస్తే రాజకీయం కొత్త మలుపులు తిరగటం ఖాయం.వీళ్లకు బీజేపీ కూడా జత కలిస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది. అటు ఆంధ్ర లో అయినా..ఇటు తెలంగాణాలో అయినా ఎవరు కలిసి వస్తే వాళ్ళతో కలిసి సాగుతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పొత్తు ఎవరితో పెట్టుకున్నా కానీ...జీహెచ్ఎంసీ ఎన్నికలలాగా వదలం. ఈ సారి పక్కా. రాజకీయ పదవుల్లో కూడా వాటా కోరతాం అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణపై బీజేపీ సీరియస్ గా దృష్టి పెట్టిన సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన మద్దతు బీజేపీకే ఉంటుంది అని ప్రకటిస్తూనే ఓట్లను ఒకే పార్టీ కు గంపగుత్తగా బదిలీ చేస్తామని ప్రకటించటం కీలకంగా మారింది. జనసేన సొంతంగా ఎన్ని సీట్లు గెలవగలదు అంటే చెప్పటం కష్టమే కానీ...ఆ పార్టీ బరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా గెలుపు అవకాశాలను దెబ్బతీయగలదు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ప్రతి నియోజకవర్గంలో జనసేనకు వెయ్యి నుంచి రెండు వేల ఓట్లు గ్యారంటీగా ఉంటాయి. ఇవి చాలు గెలుపు..ఓటములను డిసైడ్ చేయటానికి. చూడాలి రాబోయే రోజులల్లో పవన్ కళ్యాణ్ ప్రకటన ప్రభావం ఎలా ఉంటుందో. చివరి వరకు చూసి బీజేపీ పొత్తుకు రెడీ కాకపోతే తెలంగాణ లో టీడీపీ, జనసేనలు బిఆర్ఎస్ తో కలిసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనే చర్చ సాగుతోంది. ఎందుకంటే తెలంగాలో ముఖ్యంగా హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రాంత ఓట్లు బిఆర్ఎస్ కు ఎంతో కీలకం అనే విషయం తెలిసిందే.