Telugu Gateway
Telangana

ఏపీలో బీజేపీ గుట్టు రట్టు చేసిన పవన్!

ఏపీలో బీజేపీ గుట్టు రట్టు చేసిన పవన్!
X

ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ అధికార వైసీపీ, సీఎం జగన్ కు అనుకూలంగా ఉంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తాను విధి లేకే బీజేపీ నుంచి పక్కకు వెళ్లాల్సి వస్తోంది అనే సంకేతాలు అయన స్పష్టంగా ఇచ్చారు. బీజేపీ తో పొత్తుకుని తాము అనుకున్న ప్లాన్ అమలు చేసి ఉంటే తెలుగు దేశం అవసరం లేకుండానే ఎదిగేవాళ్లమని, అమరావతే రాజధాని అని లాంగ్ మార్చ్ చేద్దామని నిర్ణయం తీసుకుంటే...దీనికి ఢిల్లీ లోని బీజేపీ పెద్దలు కూడా ఓకే చేశారన్నారు. కానీ ఇక్కడకు వచ్చాక బీజేపీ స్థానిక నాయకులు అలాంటిది ఏమీ లేదని చెప్పారన్నారు. బీజేపీ కి అండగా ఉంటానని తాను చెపుతుంటే....కలిసి కార్యక్రమాలు చేయటానికి వాళ్ళు ముందుకు రాకపోతే తాను ఏమీ చేయగలను అని పవన్ కళ్యాణ్ జనసేన పదవ వార్షికోత్సవ సభలో సంచలన వ్యాఖలు చేశారు. తాను నష్టపోయిన పర్వాలేదు కానీ...రాష్ట్రం నష్ట పోకూడదు అంటూ కీలక వ్యాఖలు చేశారు. అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటన చేయాల్సి వచ్చింది అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ కి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాటానికి బీజేపీ సిద్ధంగా లేదు అనే సంకేతాలు ఇచ్చారు..ఈ కారణంగానే తాను ప్రత్యామ్నాయం చూడాల్సి వస్తోంది అనే క్లారిటీ ఇచ్చారనే చర్చ సాగుతోంది. రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారు ఎవరికైనా పవన్ కళ్యాణ్ మచిలీపట్నం సభ లో చేసిన వ్యాఖ్యల అర్ధం ఏమిటో తెలిసిపోతుంది అని చెప్పొచ్చు. తొలుత రాజధానిగా అమరావతికి అంగీకరించి ...అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతానికి బీజేపీ, జనసేనలు పొత్తులో ఉన్నాకూడా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప..కలిసి ఉమ్మడిగా ఎలాంటి ప్రణాళికలు అమలు చేయటం లేదు. అదే సమయంలో కలిసి కార్యక్రమాలు చేయటానికి బీజేపీ ముందుకు రావటానికి సిద్ధంగా లేదు అని పవన్ స్పష్టంగా ప్రకటించారు. పవన్ మాటలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలవటం పక్కా అని స్పష్టం అవుతోంది. అయితే ఇక తేలాల్సింది సీట్ల లెక్కలు మాత్రమే. ఈ రెండు పార్టీల పొత్తు కుదరకుండా ఉండటానికి తెర వెనుక ఎవరు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ పొత్తుల రాజకీయ లెక్కలు తేలాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. కాకపోతే రాజకీయాల లైన్ల లో మాత్రం క్రమక్రమంగా స్పష్టత వస్తోంది. ఎన్నికల ముందు బీజేపీ తో కటీఫ్ చెప్పినా తన తప్పు ఏమీ లేదనే సంకేతాలు ఇవ్వటానికే...పవన్ జనసేన కీలక సభలో బీజేపీ స్టాండ్ ప్రజలకు వెల్లడించే ప్రయత్నం చేశారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ సర్కారుకు, సీఎం జగన్ కు అండగా కేంద్రంలోని బీజేపీ, మోడీ సర్కారు ఉంది అన్న ప్రచారం ఎప్పటినుంచో ఉన్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర నేతలు చెపితే రాష్ట్ర నాయకులు మాట వినకపోవడం అంటూ ఉండదు. కేంద్రంలోని పెద్దలే..పవన్ కు ఒకటి చెప్పి...రాష్ట్ర నాయకులకు మరో రకంగా చెప్పి ఉంటారు అనే అభిప్రాయం కూడా నేతల్లో ఉంది.

Next Story
Share it