పాన్ ఇండియా పార్టీ మునుగోడు మల్లగుల్లాలు!

సహజంగా ఏ పార్టీ అయినా ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం తప్పేమీకాదు. కానీ ఓ వైపు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని..తెలంగాణ మోడల్ ను దేశానికి తీసుకెళతామని గొప్పగా చెప్పుకుంటున్న నేతలు స్వరాష్ట్రంలో అదీ..బంగారు పాలన అందిస్తున్నామని చెబుతున్న రాష్ట్రంలో మరీ ఇంతగా టెన్షన్ పడటం వెనక కారణం ఏమిటి?. వాస్తవానికీ ఈ సీటు టీఆర్ఎస్ గెలిచింది కాదు..కాకపోతే గతంలో ఓ సారి గెలుచుకుంది కూడా. ఆ అభ్యర్ధికే మళ్ళీ ఇప్పుడు టిక్కెట్ ఇచ్చింది. అలాంటిది ఓ ఉప ఎన్నిక కోసం ఏకంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు..ఎమ్మెల్సీలు అందరినీ మోహరిస్తోంది. నిజంగా సీఎం కెసీఆర్, కెటీఆర్ చెబుతున్నట్లు పాన్ ఇండియా పార్టీకి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏ మాత్రం సానుకూలంగా లేవనే విషయం టీఆర్ఎస్ మునుగోడులో పడుతున్న మల్లగుల్లాలు చూస్తుంటేనే తెలుస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎప్పటిలాగానే భారీ ఎత్తున ప్రలోభాలతో కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీ నాయకులను కూడా ఆకర్షిస్తున్నారు. ఈ పని అధికార టీఆర్ఎస్ తోపాటు బిజెపి కూడా చేస్తోంది. అయితే అధికార టీఆర్ఎస్ చెప్పే మాటలకు..చేసే పనులకు మాత్రం ఎక్కడా పొంతన ఉండటంలేదనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ తన సీటును తాను నిలుపుకోగలిగితే ఇక తిరుగే ఉండదు అన్న కోణంలో ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ మారినా పట్టు తనదే అని చెప్పాలనే ప్రయత్నాల్లో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి పాన్ ఇండియా పార్టీ విజయం సాధిస్తుందా..లేక ఇతర పార్టీలు మెడలో విజయహారం వేసుకుంటాయా అన్నది వేచిచూడాల్సిందే.



