Telugu Gateway
Telangana

ద‌ళిత బంధు కోసం లక్ష కోట్ల ఖ‌ర్చుకూ స‌ర్కారు రెడీ

ద‌ళిత బంధు కోసం లక్ష కోట్ల ఖ‌ర్చుకూ స‌ర్కారు రెడీ
X

ప్ర‌తి ద‌ళితవాడ‌లో కెసీఆర్ పుట్టాలి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కానికి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా, అర్హులైన దళితులందరికీ అమలు చేస్తామన్నారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నదన్నారు. దేశ దళితులందరినీ ఆర్ధిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేసే పథకంగా మారాలని సిఎం ఆకాంక్షించారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని, దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను నియమించిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు, శనివారం ప్రగతిభవన్ కు తరలివచ్చారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ... తెలంగాణలో దళితబంధు విజయవంతం కోసం ప్రతి దళితబిడ్డ పట్టుబట్టి పనిచేయాలని, ప్రతి దళితవాడలో ఒక కెసిఆర్ పుట్టాలె' అని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ లో విజయవంతం కావడం ద్వారా ప్రసరించే వెలుగు, తెలంగాణ సహా, దేశవ్యాప్తంగా విస్తరించాలన్నారు. తెలంగాణ దళితుల అభివృద్ధిని కూడా తెలంగాణ ఉద్యమంలా చేపట్టాలన్నారు. '' రాజులు, జాగీర్దార్లు జమీందార్లు, భూస్వాములు, అనంతరం వలస పాలకులు, ఇట్లా 100 ఏండ్ల పాటు అనేక రకాల పీడనను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నరు.

అన్ని రంగాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నం. తెలంగాణ వొక గాడిలో పడింది '' అన్నారు. తెలంగాణ ప్రజలు గత పాలనలో గొర్రెల మందలో చిక్కుకు పోయిన పులి పిల్లలాంటి వాల్లనే సంగతిని, స్వయంపాలన ఏర్పాటయినంక ప్రపంచం పసిగట్టిందని సిఎం వివరించారు. తెలంగాణ అభివృద్దిని చూసి దేశం నేడు నివ్వెర పోతున్నదన్నారు. తెలంగాణ రైతాంగం రోహిణీ కార్తెలోనే నాట్లేసుకునే రోజులొచ్చినయన్నారు. ఇంకా సమాజంలో వరకట్నం అంటరానితనం వంటి పలు వివక్షలు పీడిస్తున్నాయని వాటిని విద్యాభివృద్ధి, ఆర్ధికాభివృద్ది ద్వారా సాధించవచ్చునన్నారు. వృద్దులు, వంటరి మహిళలు, వికలాంగులు తదితర అభాగ్యులకు ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని, వారి కండ్లల్లో సంతోషం కనిపిస్తున్నదన్నారు. అదే రీతిలో దళిత సమాజం మోములో ఆనందాన్ని చూడాలనేదే తన పట్టుదల అని సిఎం పునరుద్ఘాటించారు.

Next Story
Share it