'తెలుగుగేట్ వే.కామ్' పై ఆగని ఎన్టీవీ వేధింపులు
జూబ్లిహిల్స్ లో ఒక ఎఫ్ ఐఆర్...మళ్లీ కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో మరో ఎఫ్ ఐఆర్
వార్తలు అవే...కేసులు వేర్వేరు చోట్ల
ఛానల్ నడుపుతూ...జర్నలిస్టుపై అక్రమ కేసులు
అధికారిక సమాచారంతో వార్తలు రాసినా వేధింపులు ఆగటం లేదు. తాము చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయనే అక్కసు. చేతిలో చానల్ ఉంది, ప్రభుత్వ అండదండలు ఉన్నాయి కదా అని పదే పదే కేసులు. వేధింపులు. తాజాగా జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ కొత్త పాలక మండలి గతంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన వివరాలతో తమ సభ్యులు అందరికీ స్టేటస్ రిపోర్ట్ పంపింది. అందులో ఉన్న అధికారిక సమాచారం ఆధారంగా తెలుగు గేట్ వే. కామ్ లో వరసగా కథనాలు ప్రచురించాం. అందులో సొసైటీ మాజీ ప్రెసిడెంట్ తుమ్మల నరేంద్రచౌదరి, మాజీ కార్యదర్శి హనుమంతరావుతోపాటు గత పాలక మండలి అవకతవకలు..ఆర్ధిక మోసాల వివరాలను బహిర్గతం చేయటం జరిగింది. దీనికి సంబంధించిన వార్త మరో ప్రధాన పత్రికలో కూడా వచ్చింది. అయినా కూడా కేవలం వాసిరెడ్డి శ్రీనివాస్, తెలుగుగేట్ వే. కామ్ ను వేధించాలనే ఉద్దేశంతో తెలుగు గేట్ వేలో రాసిన వార్తలు అన్నీ ఫేక్ న్యూస్ అంటూ సొసైటీ మాజీ కార్యదర్శి హనుమంతరావు చేసిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు ఆదేశాల మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. హనుమంతరావు తన ఫిర్యాదులోనే తనతోపాటు మా ప్రియమైన మాజీ ప్రెసిడెంట్ నరేంద్ర చౌదరిపై ఆధారాలు లేకుండా వార్తలు రాశారని ప్రస్తావించారు. అనంతరం పోలీసులు ఫోన్ చేసి స్టేషన్ కు రావాల్సిందిగా కోరటంతో ఆధారాలతో సహా హాజరు అయి వాస్తవాలు వివరించటం జరిగింది. అయితే నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి పంపాల్సిన పోలీసులు 11.30 గంటలకు స్టేఫన్ కు వెళ్లిన నన్ను కనీసం భోజానానికి కూడా బయటకు వెళ్లకుండా ఏదో నేరస్తుడిలా సాయంత్రం ఆరు గంటల వరకూ స్టేషన్ లో ఉంచారు.
ఇదే విషయాన్ని ఫేస్ బుక్ లో పెట్టాననే కారణంతో నా ఫోన్ కూడా సీజ్ చేశారు. పోస్టు డిలీట్ చేయాల్సిందిగా పోలీసులు కోరినా నేను అందుకు తిరస్కంచాను. నా తప్పేమీ లేకపోయినా ఎవరిని 'సంతోష'పర్చటానికో కానీ సాయంత్రం వరకూ ఉంచి పంపారు. ఇది అంతా ఒకెత్తు అయితే ఇప్పుడు ఇదే అంశంపై కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసు స్టేషన్ లో కూడా ఇదే తరహా ఫిర్యాదు మేరకు అక్కడ కూడా ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. కొంపల్లి సంతోష్ అనే మానకొండూరు నియోజకవర్గ ఎన్టీవీ రిపోర్టర్ ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. తెలుగు గేట్ వే. కామ్ లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఫేక్ న్యూస్ రాసి..రూమర్లు ప్రచారం చేస్తూ ఎన్టీవీ ఛానల్, ఎండీని అవమానిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అసలు ఎక్కడో కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎన్టీవీ రిపోర్టర్ కు...ఈ వార్తకు సంబంధం ఏమిటీ అంటే నేరుగా ఏమీ లేదు. పై నుంచి ఆదేశాలు వచ్చి ఉంటాయి...జూబ్లిహిల్స్ లో పెట్టి వేధించినట్లుగానే...ఆ జిల్లాలో ఒకటి..ఈ జిల్లాలో ఒకటి కేసులు పెట్టి వేధిస్తూ తిప్పితే అన్నా ...సొసైటీలో గతంలో చేసిన అక్రమాలు బయటకు రాకుండా ఉంటాయోమో అన్న ప్లాన్ ఇదే. అంతకు మించి ఏమీ లేదు. ఫేస్ బుక్ లో నాపై అభ్యంతరకర భాషలో దూషణలపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు లేవు. ఎన్డీవీ ఎడిటర్ నా పేరు మీద..నా సైట్ పేరు మీద తప్పుడు వార్తను వాట్సప్ లో ప్రచారం చేసినా చర్యలు లేవు. కానీ అదే ఎన్టీవీ ఫిర్యాదు చేస్తే మాత్రం పోలీసు వ్యవస్థ ఆగమేఘాల మీద పరుగులు పెడుతుంది.