Telugu Gateway
Telangana

కేటీఆర్ మాటలు అన్నీ పక్కా పొలిటికల్ ప్లానేనా?!

కేటీఆర్ మాటలు అన్నీ పక్కా పొలిటికల్ ప్లానేనా?!
X

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు కొంత మంది ఎన్ఆర్ఐ లు కలిసి లకారం చెరువు దగ్గర టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఆవిష్కరణ టాలీవుడ్ లో ప్రముఖ హీరోగా ఉన్న దివంగత ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో చేయించాలని పువ్వాడ అజయ్ తొలుత నిర్ణయించారు. ఈ మేరకు మేలో అయన నివాసానికి వెళ్లి ఆహ్వానం పలికారు. దీనికి ఎన్టీఆర్ కూడా ఒకే చెప్పారు. తర్వాత విగ్రహం విషయంలో వివాదం తలెత్తడం. ఇది కోర్టు కు కూడా వెళ్ళింది. న్యాయపరమైన వివాదాలు పరిష్కారం అయిన తర్వాత తొలుత అనుకున్న హీరో ఎన్టీఆర్ తో కాకుండా శనివారం నాడు ఖమ్మంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం పూర్తి చేశారు. ఈ విగ్రహావిష్కరణకు ఎన్టీఆర్ ను పిలిచినా కూడా తాను ఇప్పుడు ఉన్న రాజకీయ వాతావరణంలో రాలేనని చెప్పారా?. లేక ఎన్నికల ముందు ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రయోజనం పొందేందుకు కేటీఆర్ తో పని కానిచ్చేశారా అనే చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ స్పందించలేదు అనే చర్చ ఒక వైపు సాగుతున్న తరుణంలో ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు అని అయన సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. అయితే ఈ విషయాలు ఏమీ అధికారికంగా బయటకు రాలేదు.

కానీ శనివారం ఖమ్మంలో విగ్రహావిష్కరణ పూర్తి చేశారు. కేటీఆర్ షెడ్యూల్ లో ఈ కార్యక్రమం లేకపోయినా కూడా విగ్రహావిష్కరణ చేశారు అని వార్తలు వచ్చాయి. అంటే పూర్తిగా రాజకీయ లబ్ది కోణంలో కేటీఆర్ ఈ పని చేసినట్లు కనిపిస్తోంది అనే చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. కేటీఆర్ గతంలో ఎన్నడూ లేని రీతిలో దివంగత ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నో రికార్డు లు నెలకొల్పిన ఎన్టీఆర్ కూడా హ్యాట్రిక్ సీఎం కాలేకపోయారు అని..కెసిఆర్ మాత్రం హ్యాట్రిక్ సీఎం అయి కొత్త రికార్డు నెలకొల్పుతారు అన్నారు. కెసిఆర్ ను ఎన్టీఆర్ శిష్యుడిగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాటలు చూస్తే మాత్రం ఇది అంతా పక్కా రాజకీయ ప్లాన్ లో భాగంగానే జరిగినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి మంత్రి కెటిఆర్ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీంతో టీడీపీ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ శనివారం నాడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే డ్యామేజ్ కంట్రోల్ చర్యలా ఉన్నాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Next Story
Share it