వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు నవంబర్ 23 నుంచి
తెలంగాణలో నిలిచిపోయిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు నవంబర్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ధరణి పోర్టల్ కోసం అని రాష్ట్రమంతటా రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కారు ఇప్పుడు వ్యవసాయేతర భూములకూ ఆమోదం తెలిపింది. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ను లాంచ్ చేస్తారని సిఎం తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ....'' ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నది. అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నది. భూ రిజిష్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.
ధరణిద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని నిశ్చింతను వ్యక్తం చేస్తున్నరు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా వున్నది. ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించింది. మరో మూడు నాలుగు రోజులలో నూటికి నూరుశాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నది. ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడినంకనే వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నాం. అందుకే కొన్ని రోజులు వేచి చూసినం. నవంబర్ 23 సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను లాంచ్ చేస్తారు. ధరణి పోర్టల్ అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అధికారులను మనస్పూర్తిగ అభినందిస్తున్నా '' అని సిఎం అన్నారు.