Telugu Gateway
Telangana

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు పాత పద్దతిలోనే

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు పాత పద్దతిలోనే
X

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి చుట్టూ వివాదాలు ముసురుకోవటంతో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పాత పద్దతిలోనే చేయాలని నిర్ణయించారు. సోమవారం నుంచే ఇది అమల్లోకి రానుంది. స్లాట్ తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. రియల్టర్లతోపాటు పలు వర్గాల నుంచి నూతన విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సర్కారు కూడా ఉక్కిరిబిక్కిరి అయింది. ఓ వైపు రిజిస్ట్రేషన్ల జరగక ఆదాయం తగ్గిపోవటం ఒకెత్తు అయితే...ప్రజల నుంచి ఈ విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటం, కోర్టుల్లో కేసులు వంటి అంశాలతో సర్కారు ప్రస్తుతానికి యూటర్న్ తీసుకుంది. ఇక నుంచి కార్డు పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని సీఎం కెసీఆర్ ఆదేశించారు. అయితే ఇప్పటికే స్లాట్ బుక్‌ చేసుకున్న వారికి కేటాయించిన తేదిల్లో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. స్లాట్‌ బుకింగ్‌లు ఎవరూ అడగవద్దని.. కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకూ గురికాకూడదని ఆదేశించారు. వ్యవసాయేతర లావాదేవీల నమోదు 2020 డిసెంబర్ 14 న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆధార్‌ వివరాలు అడగకుండా మాన్యువల్‌కు మార్పులు చేసే దాకా స్లాట్‌ బుకింగ్‌ను ఆపాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Next Story
Share it