Telugu Gateway
Telangana

తండ్రీ..కొడుకుల చేతిలో జానారెడ్డి ఓటమి

తండ్రీ..కొడుకుల చేతిలో జానారెడ్డి ఓటమి
X

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి మరోసారి ఆశాభంగమే. నాగార్జునసాగర్ ఉప ఎన్నకల్లో జానారెడ్డి గెలిస్తే తదుపరి ముఖ్యమంత్రి అవుతారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు వ్యాఖ్యనించినా అవేమీ పలితాన్ని ఇవ్వలేదు. ఇక్కడ మరో విచిత్రం ఏమింటే జానారెడ్డి వరసగా తండ్రీ, కొడుకుల చేతిలో పరాభవం పాలు కావటం. 2018లో జరిగిన ఎన్నికల్లో దివంగత నోముల నర్సింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అనారోగ్యంతో నోముల మృతి చెందటంతో ఈ సీటును టీఆర్ఎస్ అధిష్టానం నోముల తనయుడు, భగత్ నే బరిలో నిలిపింది. ఇప్పుడు నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ చేతిలోనూ జానారెడ్డి ఓటమిని చవిచూశారు. గత ఎన్నికల్లో 75,884 ఓట్లు సాధించిన జానారెడ్డి 7771 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి మాత్రం జానారెడ్డిపై నోముల భగత్ 18,478 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఒక్క రౌండ్ లో మినహా ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ ఆధిక్యత చూపుతూ వచ్చి విజయం సాధించారు.

అయితే ఈ గెలుపు కోసం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ స్వయంగా రంగంలోకి దిగటంతో పాటు మంత్రులు..అధికార పార్టీ నేతలు తీవ్రంగా శ్రమించారు. అయితే గతానికి భిన్నంగా కాంగ్రెస్ నేతలు కూడా జానారెడ్డి గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సాగర్ లో గెలుపు తర్వాత నోముల భగత్ మీడియాతో మాట్లాడుతూ 'నన్ను ఆశీర్వదించిన నాగార్జున సాగర్‌ ప్రజలకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ విజయాన్ని కేసీఆర్‌కు అంకితం చేస్తున్నాను. నాన్న ఆశయాలను కచ్చితంగా నెరవేస్తాను' అని వ్యాఖ్యానించారు. తన గెలుపుకు కృషి చేసిన టీఆర్‌ఎస్‌ శ్రేణులకు రుణపడి ఉంటానని తెలిపారు.

Next Story
Share it