Telugu Gateway
Telangana

బీసీ ఛాంపియన్ ప్రయత్నాలు ఫెయిల్ !

బీసీ ఛాంపియన్ ప్రయత్నాలు ఫెయిల్ !
X

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం అయితే అసెంబ్లీ లో బిల్లు పాస్ చేసుకుని ముందుకెళ్లొచ్చు. కేంద్రం పూనుకుని పార్లమెంట్ లో చట్ట సవరణ చేస్తే తప్ప అమలుకు నోచుకోలేని అంశాన్ని తలకెత్తుకుని రేవంత్ రెడ్డి సర్కారు బొక్క బోర్లా పడిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గతంలో సుప్రీంకోర్టు ఎన్నో సార్లు రిజర్వేషన్ లు 50 శాతం మించరాదు అని తీర్పులు ఇచ్చింది. ఈ విషయంలో ఒక్క తమిళ నాడు కు మాత్రమే మినహాయింపు ఉంది. అయినా సరే తెలంగాణా లోని రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం రాహుల్ గాంధీ చెప్పారు. మేము అమలు చేస్తాం. తమను ఎవరూ ఆపలేరు అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చింది. గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్( ఎస్ఎల్పీ)పై విచారణకు సుప్రీం కోర్ట్ నో చెప్పటంతో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి...కాంగ్రెస్ సర్కారుకు దారులు మూసుకుపోయాయి.

ఇస్తే బిసి లకు పార్టీ పరంగా 42 శాతం ఇచ్చి ఎన్నికలకు వెళ్ళటం తప్ప..ఇప్పుడు మరో మార్గం లేదు అని ఆ పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కలిపించటం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తాను బిసి ల ఛాంపియన్ గా చెప్పుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అని కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం అంగీకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదని తెలిసే కదా బీజేపీ పై ఒత్తిడి కోసం అని ఢిల్లీలో ధర్నా చేసింది అని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లో బిల్లు పెట్టి దాన్ని గవర్నర్ ఆమోదించకముందే జీవో తీసుకువచ్చి రిజర్వేషన్స్ కల్పించటం అంటే అది ఏ మాత్రం నిలవదు అని ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు తెలియదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కారు పరువు పోగొట్టుకుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణా హై కోర్ట్ లో ఇదే అంశం పెండింగ్ లో ఉన్నందున తాము ఈ విషయాన్ని టేకప్ చేయలేము అని సుప్రీం కోర్ట్ తేల్చిచెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్స్ తో ఎన్నికలకు వెళ్లొచ్చు అని పేర్కొంది. దీంతో మొత్తం వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్లు అయింది.

Next Story
Share it